తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్‌ టెస్ట్‌: గంటన్నరలోనే కచ్చితమైన‌ ఫలితం! - DNA test developed by a professor at Imperial College London

మనిషిలో కరోనాను పక్కాగా నిర్ధరించడానికి సరికొత్త విధానం కనిపెట్టారు లండన్‌ పరిశోధకులు. ఇందుకు సంబంధించిన తాజా పరీక్ష పరిశోధనా పత్రాన్ని.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ప్రచురించింది.

corona latest news
కొవిడ్‌ టెస్ట్‌: గంటన్నరలోనే కచ్చితమైన‌ ఫలితం!

By

Published : Sep 18, 2020, 10:33 PM IST

కరోనా వైరస్‌ను అతి తక్కువ సమయంలోనే నిర్ధరించే పరీక్షను లండన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలాంటి ప్రయోగశాల అవసరం లేకుండానే 'డీఎన్‌ఏనడ్జ్' పరీక్ష ద్వారా కేవలం గంటన్నరలోనే కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు గుర్తించారు. తాజా పరీక్ష పరిశోధనా పత్రాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ ప్రచురించింది.

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం.. వీలైనంత త్వరగా వైరస్‌ సోకినవారిని గుర్తించడమే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. దీనికి ఎక్కువ సమయం తీసుకోవడం ప్రతికూలంగా మారింది. ఇక కొన్ని ప్రాంతాల్లో త్వరగా ఫలితమిచ్చే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నప్పటికీ తీవ్ర లక్షణాలు ఉన్నవారిలోనే కొంతవరకు కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి.

94.4 శాతం కచ్చితత్వంతో..

డీఎన్‌ఏ ఆధారిత టెస్టును లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజికి చెందిన నిపుణులు రూపొందించారు. ప్రయోగాల్లో ఇది విజయవంతం కావడం వల్ల దీన్ని వినియోగించవచ్చని అక్కడి వైద్య పరికరాల నియంత్రణ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్‌ఏ) ఏప్రిల్‌ చివరిలోనే ఆమోదం తెలిపింది. కొవిడ్‌-19 వైరస్‌ సోకిన వారిని 94.4శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుండగా, వైరస్‌ లేనివారిని వందశాతం కచ్చితత్వంతో గుర్తించ గలుగుతున్నట్లు లాన్సెట్‌ పేర్కొంది.

ఈ పరీక్ష ద్వారా ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే మనం ఉన్నచోటే ఫలితం పొందవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల ల్యాబ్‌లో వచ్చే ఫలితానికి కచ్చితంగా సరిపోలే ఫలితం వస్తున్నట్లు స్పష్టంచేశారు. ఈ విధానంలో కరోనా లక్షణాలు ఉన్న వారి ముక్కు నుంచి స్వాబ్‌ నమూనాను సేకరించి పరీక్షిస్తారని లాన్సెట్‌ నివేదికలో వివరించింది. పరీక్ష చేసేముందు దీనికి ఎలాంటి ముందస్తు ప్రక్రియ అవసరం లేదని పేర్కొంది.

కచ్చితమైన ఫలితం ఇస్తుండడం వల్ల అక్కడి ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ప్రారంభిస్తున్నట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ రేడియో ద్వారా వెల్లడించారు. కేవలం చిన్న డబ్బా మాదిరిగా ఉండే ఈ పరికరానికి ఎలాంటి ప్రత్యేక ప్రయోగశాల అవసరం లేదని.. తద్వారా కొవిడ్ నిర్ధారణ చేయడం ఎంతో సులువని‌ పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణాల్లో కూడా దీన్ని పెట్టుకునే వీలుందన్నారు. అయితే, ఈ పరికరంతో ఒకసారి ఒక టెస్టుకు సంబంధించిన సమాచారం పొందగలమని.. అలా రోజుకు 16టెస్టులు మాత్రమే చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

(గ్రాఫిక్‌: లాన్సెట్‌ జర్నల్‌ సహకారం)

ABOUT THE AUTHOR

...view details