మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డికే శివకుమార్ అరెస్టయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
గతేడాది సెప్టెంబరులో మనీ లాండరింగ్ ఆరోపణలపై శివకుమార్ సహా దిల్లీలోని కర్ణాటక భవన్ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్న శివకుమార్...గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కీలకంగా వ్యవహరించినందుకే కేంద్రం తనపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.
శివకుమార్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకొని ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు శివకుమార్ అరెస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ వైఫల్యాలపై దేశ ప్రజల దృష్టి మరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శివకుమార్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.