తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం.. - diwali special pooja

దేశమంతా వెలుగుపూలు పూయించే దీపావాళి రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పూజా సంప్రదాయం పాటిస్తారు. ఆయా రాష్ట్రాల్లో దీపావళి పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా!

దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..

By

Published : Oct 27, 2019, 5:36 AM IST

Updated : Oct 27, 2019, 7:32 AM IST

ఆనందాల కేళి అయిన దీపావళి పూజా సంప్రదాయం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరిగే ఈ పూజ దేశమంతా వెలుగు పూలు పూయిస్తుంది. పూజలు ఏ విధంగా నిర్వహించినా.. జీవితంలో జ్ఞానకాంతులు నింపుకోవాలనేదే అందరి భావన.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాల్లో నరక చతుర్దశినాడు ‘"శీతలోష్ణ సమాయుక్త సంకటక దళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః"’’ అనే మంత్రాన్ని పఠిస్తూ తెల్లవారు జామున స్నానం ఆచరించి యముడికి తర్పణం వదులుతారు. అంటే యముడి పేర్లు చెబుతూ నువ్వులు, నీళ్లు వదిలేస్తారు. సాయంత్రం దీపాలను వెలిగిస్తారు. దీపావళి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి ‘లక్ష్మీదేవి’ని పూజించి, సాయంత్రం దీపాలను వెలిగించి.. అష్టోత్తర నామాలతో మహాలక్ష్మిని పూజిస్తారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ విధానాన్నే పాటిస్తారు. దీపావళి నాడు సూర్యాస్తమయం అవుతూనే మగవారు.. దివిటీలను దక్షిణ దిక్కుకు చూపిస్తూ నిలబడతారు.

మహారాష్ట్రలో పెధిపూజన్

మహారాష్ట్రలో దీపావళి నాడు ‘పెధిపూజన్‌’ పేరుతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం లక్ష్మీదేవిని, సరస్వతిని అష్టోత్తర నామాలతో పూజిస్తారు. తీపి పదార్థాలను నివేదనగా సమర్పిస్తారు. ఇదే రోజు వ్యాపారులు జమాఖర్చులు చూసుకొని కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇంటి ముందు పదహారు దీపాలను వెలిగించి తమ ఇంట్లోకి రావాలని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.

గుజరాత్​లో వాహీ పూజ

గుజరాతీలు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వ్యాపారులు జమాఖర్చు పుస్తకాలను, విద్యార్థులు పాఠ్య పుస్తకాలను పూజిస్తారు. దీనికి ‘వాహీ పూజ’ అని పేరు. ఇంట్లోని బంగారమంతా తెచ్చి దీపాల ముందు ఉంచి పూజ చేస్తారు.

యూపీలో భరత్​ మిలాప్​

ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్ష్మీదేవిని పూజించి, దీపాలను వెలిగించి ఆరాధించడంతో పాటు ‘భరత్‌ మిలాప్‌’ పేరిట శ్రీరాముడిని కొలుస్తారు. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు.

బంగాల్​లో కాళీమాతకు పూజ

పశ్చిమ్‌బంగలో నరక చతుర్దశి అర్ధరాత్రి వేళ మహిళలు చేటలు తీసుకొని కొడుతూ ఇంటి నుంచి బయటకు వస్తారు. ఇది ఇంట్లోని అలక్ష్మిని తరిమి వేయడంగా భావిస్తారు. తర్వాత ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్ది, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఆనాటి సాయంత్రం కాళీమాతను కూడా పూజిస్తారు.

పంజాబ్​లో వెండినాణేలతో

పంజాబీలు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు పితృదేవతలను ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఒక మాసమంతా తమ వెంట ఉంటారని నమ్మకం. దీపావళి నాడు ఆరాధనలు అందుకొని, తాము వెలిగించే దీపాలను చూసి పితృలోకాలకు తిరిగి వెళ్లిపోతారని విశ్వసిస్తారు. వెండినాణేలతో లక్ష్మీదేవిని పూజిస్తారు.

మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో దీపావళిని వివిధ రకాలుగా చేసుకునే భారతీయులందరి భావన ఒకటే. అజ్ఞానమనే చీకట్లు తొలగి తమ జీవితాల్లో జ్ఞాన కాంతులు నింపుకోవడమే. అలక్ష్మిని వద్దని లక్ష్మిని జీవితాల్లోకి ఆహ్వానించడమే!

-రచయిత: ఐఎల్‌ఎన్‌ చంద్రశేఖర రావు.

Last Updated : Oct 27, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details