తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అడ్డగింత వద్దు... అర్థవంతమైన చర్చే ముద్దు' - 'బిల్లుల పరిశీలన, అడ్డగింత మధ్య వ్యత్యాసం ఉండాలి'

పార్లమెంట్​లో కీలక బిల్లుల పరిశీలన, అడ్డగింత మధ్య వ్యత్యాసాన్ని సభ్యులు గుర్తించాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బిల్లులను అడ్డుకోవడం కంటే.. అర్థవంతమైన చర్చల ద్వారా దేశాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. సభా కార్యకలాపాలకు ఏనాడూ అడ్డుతగలకుండా ఎన్సీపీ, బీజేడీ పాటిస్తున్న నిబంధన అభినందనీయమన్నారు మోదీ.

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

By

Published : Nov 18, 2019, 5:48 PM IST

Updated : Nov 18, 2019, 8:31 PM IST

'అడ్డగింత వద్దు... అర్థవంతమైన చర్చే ముద్దు'

పార్లమెంటులో కీలక బిల్లులను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చల ద్వారా దేశాభివృద్ధికి దోహదపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మ వంటిదన్నారు. బిల్లుల పరిశీలన, అడ్డగింత మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు.

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా చేపట్టిన ప్రత్యేక చర్చలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఎగువసభ ప్రాధాన్యం సహా కాలానుగుణంగా మారాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాజ్యసభ చరిత్ర సృష్టించడమే కాకుండా.. చరిత్రను మార్చడంలోనూ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.

కలిసి పనిచేస్తేనే..

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉన్నందున ఎగువ సభలో సమాఖ్య స్పూర్తి పరిఢవిల్లుతోదని పేర్కొన్నారు. పెద్దల సభను ద్వితీయశ్రేణి సభగా మార్చొద్దని వాజ్‌పేయీ హెచ్చరించారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సమర్థించే సభలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

" కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందిస్తుంది. వాటిలో రాష్ట్రాల ఆకాంక్షలు, సమస్యలను ప్రస్తావించాలి. కేంద్రం రూపొందించే చట్టాల్లో ఆయా అంశాలను పొందుపర్చడంలో ఈ సభ కీలకంగా వ్యవహరిస్తోంది. వాటి ప్రయోజనం సమాఖ్య వ్యవస్థకు కూడా లభిస్తుంది. రాజ్యసభ రెండో సభ. అయితే... ద్వితీయ శ్రేణి సభ ఎప్పుడూ కాదు. దేశాభివృద్ధికి సహకరించే సభలా ఇది ఉండాలి. రాజ్యసభ నిరోధ సమతౌల్యం అనే మూల సిద్ధాంతాన్ని సమర్థంగా పాటిస్తోంది. కానీ.. పరిశీలన, అడ్డుతగలడం వంటి అంశాల మధ్య తేడా ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సమతూకం చేయడం, అడ్డుకునే విషయాల మధ్య వ్యత్యాసాన్ని కూడా సరిచూసుకోవాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎన్సీపీ, బీజేడీపై ప్రశంసలు..

చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ ద్వారా మాత్రమే సత్ఫలితాలు వస్తాయని మోదీ పేర్కొన్నారు. సభను అడ్డుకోవడం కంటే చర్చా మార్గం ఎంచుకోవడం మంచిదన్నారు. ఈ విషయంలో ఎన్సీపీ, బీజేడీ అత్యుత్తమ విధానాన్ని అవలంబిస్తున్నాయని అభినందించారు.

"అడ్డుకునే మార్గం కంటే...చర్చించే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఈ సందర్భంగా నేను రెండు పార్టీలను ప్రస్తావిస్తున్నాను. అవి ఎన్సీపీ, బీజేడీ. ఈ రెండు పార్టీల గొప్పతనం ఏమంటే... ఎప్పుడూ సభామధ్యంలోకి వెళ్లకూడదని స్వయంగా నిబంధన పెట్టుకున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా ఆ నిబంధనను ఉల్లంఘించలేదు. భాజపా సహా అన్ని పక్షాలు ఈ రెండు పార్టీల నుంచి నేర్చుకోవాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఎన్సీపీ, బీజేడీ రాజకీయ విజయయాత్ర ఎక్కడా ఆగిపోలేదు. సభామధ్యంలోకి వెళ్లకుండా కూడా ప్రజల మనసు గెల్చుకోవచ్చు. ఎన్సీపీ, బీజేడీ పెట్టుకున్న అత్యుత్తమ నిబంధనపై ఈ సభలో చర్చ జరగాలి. ఆ పార్టీలను అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రాజ్యసభ శాశ్వతసభ అని, ఇది ఎప్పటికీ రద్దుకాదన్నారు మోదీ. ఆర్టికల్‌ 370 రద్దు, ముమ్మారు తలాక్‌, వస్తు,సేవల పన్ను వంటి దేశాభివృద్ధికి దోహదపడే బిల్లులను ఎగువ సభ ఆమోదించిందని గుర్తుచేసుకున్నారు.

ఇదీ చూడండి: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళాల వెల్లువ

Last Updated : Nov 18, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details