మిజోరం రాష్ట్రానికి చెందిన బ్రు తెగకు చెందిన గిరిజనులు ఇక నుంచి త్రిపురలో శాశ్వతంగా నివసించనున్నారు. దీనికి సంబంధించి బ్రు తెగ ప్రజల ప్రతినిధులకు, మిజోరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దిల్లీలోని నార్త్ బ్లాక్లో ఈ ఒప్పందం జరిగింది.
"ఈ ఒప్పందం ప్రకారం మిజోరం నుంచి వచ్చిన 30 వేల మంది బ్రు తెగ ప్రజలకు శాశ్వతంగా త్రిపురలో నివసించే అవకాశం లభిస్తుంది. బ్రు తెగ ప్రజలు, మిజోరం, త్రిపుర ప్రభుత్వాలు ఈ ఒప్పందానికి ముందుకురావడం హర్షనీయం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఈ సందర్భంగా బ్రు తెగ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు కురిపించారు. ఒప్పందం ప్రకారం తెగ ప్రజలకు రూ.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ సహా ఇళ్ల స్థలాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 5 వేల రూపాయల నగదు సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కుటుంబాలకు రెండు సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.