సీట్ల కోసం ఎన్డీఏలోని జనతా దళ్ యునైటెడ్(జేడీయూ), లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) మధ్య అభిప్రాయ భేదాలు... నాయకత్వం విషయంలో ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తి... అధికార పక్షంలోని అసంతృప్త నేతలతో చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటనలు.
ఇలా.. ఎన్నికలకు ముందే బిహార్ రాజకీయం వేడెక్కింది. పార్టీల మధ్య కలహాలు ఎక్కువవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల్లో కొత్త పొత్తులు చూసే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. కూటముల్లో సమూల మార్పులు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సీట్ల కోసం ఎల్జేపీ పట్టు
ప్రస్తుతం బిహార్‌లో అధికార పార్టీ జనతా దళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ... ఎన్డీఏలో ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో మిత్రపక్షం తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తోందన్న కారణాలతో ఎల్జేపీలో అసంతృప్తి పెరిగిపోయింది.
ఇదీ చదవండి:పాసవాన్... ఎన్డీఏకి షాక్, ఆర్జేడీకి బ్రేక్ ఇస్తారా?
భాజపా, ఎల్జేపీ మధ్య రాజకీయ సమీకరణాలు బాగానే కనిపిస్తున్నా.. చిరాగ్ పాసవాన్(ఎల్జేపీ అధ్యక్షుడు) పదేపదే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎల్జేపీని వదిలి మరో పార్టీని చూసుకోవాలని భాజపాకు చిరాగ్ పరోక్షంగా సందేశం ఇస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
"బిహార్‌లో ఎల్జేపీ తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటోంది. చిరాగ్ పాసవాన్ చాలా అత్యాశపడుతున్నారు. జేడీయూకు ఎల్జేపీ అసలు మిత్రపక్షమే కాదు. పొత్తు భాజపాతో పెట్టుకున్నారు కాబట్టి వారి డిమాండ్లను కూడా ఆ పార్టీ వద్దే పరిష్కరించుకోవాలి. మా వద్ద కాదు."
-జేడీయూ సీనియర్ నేత
2015 ఎన్నికల్లో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్ ఆధ్వర్యంలో ఎల్జేపీ 42 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడి కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం రామ్ విలాస్ తనయుడు చిరాగ్ పాసవాన్.. పార్టీని నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గతంలో మాదిరిగానే సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇందుకు జేడీయూ వ్యతిరేకిస్తోంది.
లెక్కల రాజకీయం
అయితే 2015లో రాజకీయ పరిస్థితులు వేరు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిలో జేడీయూ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎల్జేపీకి అన్ని స్థానాలు కేటాయించేందుకు జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2015 ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లు గెలిచిన పార్టీకి అన్ని స్థానాలు కట్టబెట్టడానికి సిద్ధంగా లేమని చెబుతోంది. కేవలం పది స్థానాలను కేటాయించే యోచనలో ఉంది.
ఇదీ చదవండి:బిహార్ సమరం: కాలం చెల్లిన కులం కార్డు!
ఎల్జేపీ సైతం ఇదే తరహా లెక్కలు బయటపెడుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ కేవలం రెండు సీట్లకే పరిమితమైందని, అయినప్పటికీ ఎన్డీఏలో చేరిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో 17 సీట్లు కేటాయించినట్లు గుర్తు చేస్తోంది.