ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం. మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ ఈ సుందరమైన కట్టడాన్ని నిర్మించాడు. రాజస్థాన్‌లోని చురూ జిల్లాలోనూ ప్రేమకు చిహ్నమైన మరో కట్టడం కనిపిస్తుంది. భర్త జ్ఞాపకంగా ఓ భార్య నిర్మించిన ఈ కట్టడం కూడా చూసేందుకు తాజ్‌మహల్ లాగే ఉంటుంది. చనిపోయిన సేత్ హజారీమాల్ గుర్తుగా ఆయన భార్య సరస్వతీ దేవి, ఆమె దత్తపుత్రుడు కలిసి దుధ్వాఖారాలో దీన్ని 70 ఏళ్ల క్రితం కట్టించారు.
"సేత్ హజారీమాల్‌ను ఖననం చేసిన స్థానంలోనే ఈ కట్టడం నిర్మిచారు. ఇది కట్టి 71 ఏళ్లు కావస్తోంది."
-మురారీ శర్మ, పురోహితుడు
మార్బుల్ రాయిని ఉపయోగించి ఈ బిల్డింగ్ నిర్మించారు. రాళ్లను కలిపేందుకు ఎలాంటి కంకర, సిమెంటు వినియోగించలేదు. ఈ భవనంలోపల ధర్మశాల ఉంటుంది. పర్యటకులు ఇక్కడే బసచేసే అవకాశం కూడా ఉంది. కట్టడం ముందు, వెనకభాగాల్లో అందమైన ఉద్యానవనం ఉంటుంది. లోపల ఉన్న శివుని గుడిలో శ్రావణ మాసం, శివరాత్రి సమయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
"ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన మహాశివుడి ఆలయముంది. చుట్టుపక్కల ఉన్న శివాలయాల్లో ఇదే అతిపెద్దది."
-అనిల్ సింగ్, దుధ్వాఖారా వాసి