తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్​ 370 రద్దుతో కశ్మీర్​కు మేలు జరిగిందా? - ఆర్టికల్​ 35ఏ

అధికరణ 370 రద్దు తరువాత జమ్ము, కశ్మీర్‌లో పురోగతి సాధ్యపడుతుందని ఆ సమయంలో కేంద్రం ధీమాగా ప్రకటించింది. స్వయంప్రతిపత్తి కారణంగా ఇన్నాళ్లు ఆ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపింది. ఈ ఒక్క నిర్ణయంతో అంతా మారిపోతుందని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయి ఏడాది పూర్తైన తరుణంలో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి చర్చించాల్సిన అవసరముంది. ప్రస్తుతానికి అయితే ఈ విషయంలో పురోగతి పెద్దగా లేదన్నది చాలామంది మాట. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు. వాటి కారణంగా అభివృద్ధి సంగతి అటుంచితే.. అసలు ఈ దిగ్బంధంతో వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు స్థానికులు.

Did abrogation of Article 370 open doors of development in Jammu and Kashmir?
ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​కు మేలు జరిగిందా?

By

Published : Aug 5, 2020, 8:11 AM IST

ఆర్టికల్ 370 రద్దు.. చరిత్రను తిరగరాసిందన్నది ఎంత నిజమో... ఆ కారణంగా జమ్ము, కశ్మీర్‌లో ఆర్థిక, అభివృద్ధి సంక్షోభం తలెత్తిందన్నదీ అంతే నిజం అంటున్నారు అక్కడి వారు. జమ్ము, కశ్మీర్‌కు సంబంధించి ఎప్పటి నుంచో ప్రధానంగా కనిపిస్తున్న లోపం.. ప్రైవేటు పెట్టుబడులు రాకపోవటం. అయితే.. ఇందుకు కారణం ఆర్టికల్ 370 కాదు అన్నది నిపుణుల విశ్లేషణ. దశాబ్దాలుగా రాజకీయ అనిశ్చితి, భద్రతాపరమైన భయాల కారణంగా పెట్టుబడులు రాలేదన్నది పలువురి మాట. అంటే.. ఇప్పుడు అధికరణ 370 రద్దు చేసినా ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్న నమ్మకం కలిగించలేకపోయిందన్నదే కీలకాంశం.

పెట్టుబడులు లేక డీలా..

అసలు ఈ రద్దు నిర్ణయమే ఏకపక్షంగా జరిగిందని ఏడాదిగా జమ్ము, కశ్మీర్​కు చెందిన‌ పార్టీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడవే పార్టీలు.. అసలిక్కడ అభివృద్ధి ఏం జరిగిందో చూపించాలనీ ప్రశ్నిస్తున్నాయి. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఇప్పటికీ జమ్ము, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. భాజపా, ఆర్‌ఎస్ఎస్ అజెండా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. ఈ కారణంగా ఎలాంటి సానుకూల మార్పులు జరగలేదని ఆరోపిస్తోంది. నిరుద్యోగిత శాతం పెరగటమే కాక ఆర్థిక వ్యవస్థ కుదేలైందని శ్రీనగర్‌కు చెందిన పీడీపీ నేత రౌఫ్ దర్ ఈటీవీ భారత్‌తో చెప్పారు.

ఆర్థిక విశ్లేషకుడు ఎజాజ్ ఆయూబ్‌దీ ఇదే విషయమై మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ము, కశ్మీర్‌లో ఆర్థిక, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోయాయని.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇంకాస్త సంక్షోభంలోకి జారుకున్నాయని వివరించారు. 40-45 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని.. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్​ఐఈ) ప్రకారం.. జమ్ము, కశ్మీర్‌ జీడీపీ వృద్ధి -20శాతంగా నమోదైందని, నిరుద్యోగ రేటు 22%పైగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడులు రాకపోవటమే సమస్యగా ఉందంటే...అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరగకపోవటం ఇంకాస్త నిరాశకు గురి చేసింది.

పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలంటే మౌలిక వసతులు చాలా కీలకం. రాజకీయ నిశ్చితీ అవసరమే. కానీ.. ఈ ప్రాంతాల్లో మొదటి నుంచి లేనివే ఇవి. స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాతైనా పరిస్థితులు మారతాయనుకుంటే అది జరగలేదు. అందుకే... ఇక్కడ రాజకీయ స్థిరత్వం ఏర్పడే వరకు ఎలాంటి మార్పులూ జరగవని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

రద్దుకు ముందే భేష్​..

అధికారిక లెక్కల ప్రకారం.. స్వయం ప్రతిపత్తి కోల్పోక ముందు జమ్ము-కశ్మీర్‌లో పేదరికం రేటు 10.35గా ఉంది. బిహార్, అసోం, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ.

జమ్ము, కశ్మీర్‌లో తలసరి ఆదాయం 62 వేల 145 రూపాయలు. ఆయుర్దాయం విషయంలోనూ ముందంజేలోనే ఉన్నాయి. 2012-16 లెక్కల ప్రకారం జాతీయ సగటు ఆయుర్దాయం 57 సంవత్సరాలు కాగా జమ్ము, కశ్మీర్‌లో ఇది 73.5 ఏళ్లు. 2017 గణాంకాల ఆధారంగా దేశ శిశుమరణాల సగటు రేటు 33గా ఉంటే.. ఇక్కడ అది 23గా నమోదైంది. 2011 లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత రేటు 72%గా ఉంటే.. ఇక్కడ అది 67%గా తేలింది. మహిళా వివాహాల విషయానికొస్తే 2015-16లో 8.7% జమ్ము కశ్మీర్‌లో 18ఏళ్ల లోపు వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 26.8%గా ఉండగా.. బిహార్‌లో 42.5%, గుజరాత్‌లో 24.9%గా నమోదయ్యాయి.

విద్యాపరంగా చూస్తే...జమ్ముకశ్మీర్‌లో ప్రత్యేక చట్టం ఉండేది. ప్రభుత్వాధీనంలో నడిచే పాఠశాలల్లో 8వ తరగతి వరకు అందరికీ ఉచిత, నిర్బంధ విద్య అమలయ్యేది.

జీడీపీలో మాత్రం...

ఈ అన్ని విషయాల్లో ముందంజలోనే ఉన్నప్పటికీ... జీడీపీ అంశంలో మాత్రం వెనకబడే ఉంది జమ్ముకశ్మీర్. రుణాలు, జీడీపీ నిష్పత్తి 49.2%గా ఉంది. కరోనా కారణంగా దేశమంతా 3 నెలలకుపైగా లాక్‌డౌన్‌ విధిస్తేనే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కానీ జమ్ము కశ్మీర్‌లో...స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది. ఈ రద్దు నిర్ణయంపై ఎలాంటి ఉద్యమాలు, అల్లర్లు జరగకుండా 7 నెలల పాటు పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాటు చేయటం, ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేయటం వంటివి ఆందోళన కలిగించాయి.

కరోనా కారణంగా మార్చి నుంచి లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. అలా దాదాపు ఏడాది పాటు దిగ్బంధంలోనే ఉంది.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం. ఫలితంగా 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ షేక్ ఆశిక్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. జమ్ము, కశ్మీర్‌ ఎకనామిక్ కన్ఫెడరేషన్ కో కన్వీనర్ అబ్రర్ అహ్మద్ ఖాన్‌ కూడా ఈ విషయమై మాట్లాడారు. రవాణా, పర్యాటకం సహా అన్ని వ్యాపార రంగాలు ఏడాది పాటు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయాయని వివరించారు. నిరుద్యోగిత పెరగటమూ మరో సవాలని తెలిపారు. పర్యటక అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారూ ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

యువతలో అసహనం...

రోజురోజుకూ నిరుద్యోగిత పెరుగుతున్న కారణంగా అక్కడి యువత ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తోంది. అధికరణ 370 రద్దుకు ముందు స్థానికులకు మాత్రమే అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బయట వ్యక్తులూ ఇక్కడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించటం స్థానిక యువతలో ఆందోళన పెంచుతోంది. స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన కొన్ని నెలల్లోనే 8 వేల ఖాళీలు భర్తీ చేస్తామని కేంద్రం చెప్పినా.. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగమే పోయి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యువత అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయటంలోనూ కేంద్రం చొరవ చూపలేదన్నది మరికొందరి వాదన.

కేంద్రం నిర్ణయంతోనే పర్యటక రంగం దెబ్బతని, సంక్షోభం నుంచి బయట పడలేక అయోమయ స్థితిలో ఉన్న వారికి.. కరోనా మరో పిడుగుపాటుగా మారింది. హౌస్ బోట్‌ రంగంలో దాదాపు 200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. జమ్ము,కశ్మీర్‌లో మానవహక్కుల ఫోరం ఇచ్చిన లెక్కలు కూడా ఏడాదిలో 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరైందని చెబుతున్నాయి.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details