విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తాజాగా గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘటన తీవ్రమైనదేనని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా అభిప్రాయపడ్డారు. ప్రతిష్టంభనను దౌత్యమార్గంలోను, రాజకీయంగాను పరిష్కరించుకోవాలన్నారు. ఈటీవీ భారత్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తాజా పరిస్థితులు, ఉద్రిక్తతలపై కీలక విషయాలు వెల్లడించారు.
భారత్-చైనాల మధ్య తాజా ప్రతిష్టంభనపై మీరేమంటారు?
ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభమైనట్లు చెబుతున్నా.. సరిహద్దులో పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోంది. తాజా ఘటనతో లద్దాఖ్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. దీనిపై ఎలా వ్యవహరిస్తారన్న విషయమై ఈ ఘటన పర్యవసానాలుంటాయి.
చైనా సైనికులు ఈ ప్రాంతాన్నే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారు?
ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి పశ్చిమాన వాస్తవాధీన రేఖ ఉందని చైనా, తూర్పున ఉందని మనం అంటున్నాం. అక్కడే చైనా అతిక్రమణలకు పాల్పడుతోంది. గాల్వాన్ నది టిబెట్ నుంచి వస్తూ షాయోక్ నదిలో కలుస్తుంది. షాయోక్ వాస్తవాధీనరేఖ నుంచి 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్‌ను కలిపే కీలక రోడ్డు ఉంది. అయితే చైనా ఇందులోకి వస్తే మనకు రోడ్డు ఉండదు. అందుకే ఈ ప్రధాన రహదారిని కాపాడుకోవడానికి గాల్వాన్ లోయ చాలా ముఖ్యం.
ఇది జటిలమైనదని ఎందుకు భావిస్తున్నారు?
తూటాలు పేలకపోయినా అక్కడ నియమాల ఉల్లంఘన జరిగింది. కొందరు చనిపోయారు. సరిహద్దుల్లో అశాంతి నెలకొనడం జటిల సమస్యే. డోక్లామ్, చుమార్‌లలోనూ ఉభయ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పటికీ హింస జరగలేదు. రెండువైపులా మరణాలు చోటుచేసుకుంటే పరిష్కారం కనుక్కోవడం కష్టమవుతుంది. యూనిఫామ్‌లో ఉన్న సైనికులు ఇలా బాహాబాహీ తలపడటం తప్పు. ఇదో వీధి పోరాటంలా అనిపిస్తోంది.
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ 800 కి.మీ.లకు పైగా ఉంది. దీనిపై రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోవడమే సమస్య. ఇది మ్యాప్‌ల్లోనూ లేదు. ఇలాంటి సందర్భాల్లో పెట్రోలింగ్‌లో ఉద్రిక్తతలు తలెత్తుతుంటాయి. కానీ తాజా ఘటనలో తలపడిన తీరు ఇది సాధారణ పెట్రోలింగ్ కాదని సూచిస్తోంది. చైనా వైపు నుంచి వ్యూహాత్మకంగానే ఇది జరిగింది. ఒక ప్రణాళిక ప్రకారమే మందీ మార్బలంతో నాలుగైదు ప్రాంతాలకు వారొచ్చారు.
ఇప్పుడు ముందుకెళ్లే మార్గమేమిటి?
దీనికి సైనిక పరిష్కారమేదీ కనిపించడం లేదు. దౌత్యమార్గంలోను, రాజకీయంగా మాత్రమే పరిష్కరించాలి. రెండు దేశాల మధ్య చర్చలతోనే పరిష్కారం దొరుకుతుంది.
ఇదీ చూడండి: నెత్తురోడిన గాల్వన్ లోయ.. ఇరువైపులా భారీ ప్రాణనష్టం!