బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయికి వస్తోన్న క్రమంలో కరోనా నిబంధనలు గాలికి వదిలేసి విమానంలో మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం చూపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై ఆగ్రహం చెందిన విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ శనివారం విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విమానంలో ఎవరైనా ఫొటోలు తీసినట్లు కనిపిస్తే రెండు వారాల పాటు ఆ విమాన సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఫొటోలు తీస్తే రెండు వారాలు సస్పెన్షన్ - విమానయాన సంస్థకు డీజీసీఏ సమన్లు
సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ.. విమాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విమానంలో ఎవరైనా ఫొటోలు తీసినట్లు కనిపిస్తే రెండు వారాల పాటు ఆ విమాన సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
దానికి సంబంధించి ట్విటర్‌లో విడుదల చేసిన ప్రకటనలో.."పౌర విమానయాన రెగ్యులేషన్స్, ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డెరెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ రాతపూర్వకంగా అనుమతి ఇచ్చిన సందర్భంలో మినహా ఏ ఒక్క వ్యక్తి కూడా విమానంలో ఫొటోలు తీయరాదు. విమానం టేక్‌ఆఫ్, ల్యాండింగ్, డిఫెన్స్ ఏరోడ్రోమ్ వద్ద ఉన్నప్పుడు ఈ అనుమతి వర్తించదు" అని దానిలో పేర్కొంది. అయితే సదరు సంస్థలకు శ్రద్ధ లేకపోవడం వల్ల ఈ నిబంధనలను పాటించడంలో విఫలం అవుతుంటాయని నొక్కి చెప్పింది. అలాగే, ఇకనుంచి అలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటే ఆ మరుసటి రోజునుంచి నిర్దిష్ట మార్గంలో రెండు వారాల పాటు విమానాలు నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆ నిర్ణయం ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సదరు సంస్థలపై అన్ని చర్యలు తీసుకున్న తరవాతే తిరిగి ప్రయాణాలకు అనుమతి ఇస్తామని తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు భద్రతాప్రమాణాలను పాటించడంలో రాజీపడేలా చేస్తాయని దానిలో పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ నెల 9న కంగన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ముంబయికి చేరుకున్నారు. ఆ క్రమంలో మీడియా ప్రతినిధులు ఆమె ఫొటోలు, వీడియోలు తీశారు. వారు కొవిడ్ నిబంధనలు పాటించకుండా పక్కపక్కనే నిల్చోవడం ఆ వీడియోల్లో కనిపించింది. దానిపై ఆగ్రహం చెందిన డీజీసీఏ ఇండిగోను వివరణ కోరింది. తమ సిబ్బంది అన్ని నిబంధనలు పాటించారని, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇండిగో వెల్లడించింది.