జనవరి 26న దిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రీయ మజ్దూర్ సంఘటన్.. ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్ వీఎం సింగ్ ప్రకటించారు. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు సింగ్ పేర్కొన్నారు. అందుకే ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.
వేరొకరి మార్గంలో ఈ ఆందోళనను ముందుకు కొనసాగించలేమన్నారు సింగ్. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరేలా ఉన్నప్పుడు తాము ఉద్యమం కొనసాగించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నేతలు మంగళవారం ర్యాలీని ముందుగానే ప్రారంభించడం సరికాదన్నారు.
"రాకేశ్ తికాయత్ లాంటి నేతలు సమయానికంటే ముందు బారికేడ్లు తోసుకుని రావడం వల్లే ఉద్రిక్తత నెలకొంది. నిర్దేశిత మార్గాల్లో కాకుండా ర్యాలీని వేరే మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించాం? ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలం. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆందోళన నుంచి తప్పుకుంటున్నా. మద్దతు ధర కోసం ఆందోళన కొనసాగుతుంది. కానీ ఈ మార్గంలో ఆందోళన చేయాలని ఇక్కడికి రాలేదు. రైతులు దెబ్బలు తినడానికో, చనిపోవడానికో రాలేదు. రైతుల హక్కులు సాధించుకోవడానికి వచ్చాం."
- వీఎం సింగ్, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్