తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సేనకు ఊహించని షాక్​- 'థ్రిల్లర్​'ను తలపించిన రాజకీయం - maharashtra bjp

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం కోసం రోజులతరబడి సాగిన ప్రతిష్టంభన ముగిసింది. ఎవరి అంచనాలకు అందని విధంగా భాజపా, ఎన్​సీపీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నానా తంటాలు పడ్డ శివసేనకు పెద్ద షాకిచ్చింది కమలదళం. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయం తనకు తెలియదంటూ ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సేనకు ఊహించని షాక్​- థ్రిల్లర్​ సినిమాను తలపించిన రాజకీయం

By

Published : Nov 23, 2019, 10:06 AM IST

మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. థ్రిల్లర్‌ సినిమాను మరిపించేలా రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అధికార పంపిణీపై అలకబూనిన శివసేనకు ఊహించని రీతిలో షాక్‌ ఇచ్చిన భాజపా యావద్దేశం ఆశ్చర్య పోయేలా ఎన్​సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజులుగా కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటు దిశగా సిద్ధం చేస్తూ వచ్చిన మారాఠా యోధుడు శరద్‌పవార్ ఈ విషయం తనకు తెలియదు అనడం గమనార్హం.

శీతాకాలంలో చలికి వణుకుతూ నిద్రలేచిన.. దేశ ప్రజలు, రాజకీయ నేతలు, దిగ్గజ విశ్లేషకులను సైతం ముచ్చెమటలు పట్టించే రీతిలో తాజాకబురు చెప్పింది భాజపా. శివసేన, కాంగ్రెస్‌తో పదిరోజులుగా ప్రభుత్వ ఏర్పాటు చర్చలు జరిపిన ఎన్​సీపీ అర్ధరాత్రి హఠాత్తుగా భాజపాతో కలిసి పోయింది. శివసేన, కాంగ్రెస్‌కు అందరికీ అదిరిపోయే షాకిస్తూ తెల్లవారేసరికి భాజపా, ఎన్​సీపీ సర్కారు కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్​సీపీ ముఖ్య నేత అజిత్‌పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారి ఇరువురి చేత ప్రమాణం చేయించారు.

రాజకీయ నాటకం

అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకుగాను ఎన్నికల్లో కలిసి పోటీచేసిన భాజపా, శివసేన 161 స్థానాలు గెల్చుకున్నాయి. మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన భాజపాను డిమాండ్‌ చేసింది. అందుకు నిరాకరించిన భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేమని గవర్నర్‌కు తేల్చిచెప్పింది.

ఈ క్రమంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. శివసేన, 54 సీట్లు గెల్చుకున్న ఎన్​సీపీ, 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో వెంటనే స్పందించిన ఎన్​సీపీ అధినేత శరద్‌పవార్ శివసేనతో కలిసేందుకు ససేమిరా అన్న కాంగ్రెస్‌ను ఒప్పించే బాధ్యతను తలకెత్తుకున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో చర్చలు జరిపారు.

తొలుత కాంగ్రెస్ వెనకడుగు

సిద్ధాంతాల పరంగా పూర్తి విరుద్ధమైన శివసేనతో కలిసేందుకు కాంగ్రెస్‌ మొదట వెనుకాడింది. చాలా మంది సీనియర్లు... శివసేనకు మద్దతు ఇవ్వొద్దని అధిష్ఠానానికి గట్టిగా చెప్పారు. అయితే పవార్‌ ఒత్తిడితో కాంగ్రెస్‌ అధినాయకత్వం వైఖరిలో మార్పు వచ్చింది. రెండురోజుల క్రితం సమావేశమైన.. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి- సీడబ్ల్యూసీ మహా రాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అంగీకారం తెలిపింది. ఎన్​సీపీతో కనీస ఉమ్మడి ప్రణాళిక రచించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. గురువారం సమావేశమైన ఎన్​సీపీ, కాంగ్రెస్‌నేతలు శివసేనకు మద్దతిచ్చే విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సహా శుక్రవారం ఆ పార్టీతో ముంబయిలో చర్చలు జరిపాయి. ఈ రోజు తెల్లవారేసరికి భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం కొలువుదీరడం యావత్​ దేశానికి షాకిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details