తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా వ్యాక్సిన్​ తయారీకి రెండేళ్లు పట్టొచ్చు' - corona in india

కరోనా వ్యాప్తిపై ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. వైరస్​ను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. కరోనా పరీక్షలకు సరిపడా సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. వ్యాక్సిన్​ తయారీకి రెండేళ్ల సమయం పట్టొచ్చని పేర్కొంది.

developing a vaccine will take at least one-and-a-half to two years.
'కరోనా వ్యాక్సిన్​ తయారీకి రెండేళ్లు'

By

Published : Mar 12, 2020, 6:14 PM IST

Updated : Mar 12, 2020, 6:59 PM IST

'కరోనా వ్యాక్సిన్​ తయారీకి రెండేళ్లు పట్టొచ్చు'

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేపట్టింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని సూచించింది. మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షా సౌకర్యాలు సరిపడా ఉన్నట్లు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి పెద్ద ఎత్తున లేదని..స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి మాత్రమే సోకినట్లు పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లావ్​ అగర్వాల్​​. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు.

"రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమన్వయం చేస్తూ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వ్యాప్తిపై నిఘా, నిర్బంధ కేంద్రాలు, ఐసోలేషన్​ వార్డుల ఏర్పాటు, వ్యక్తిగత భద్రతా సామగ్రిపై ప్రజలకు అవగాహన కల్పించటం, వైద్య సిబ్బందికి శిక్షణ సహా కొవిడ్​-19పై తక్షణ స్పందన​ బృందం ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. విదేశాల్లోని పౌరుల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయులను తరలించటం ఫిబ్రవరిలోనే ప్రారంభించాం. కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు వంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రధానమంత్రి సూచనలతో ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఏర్పాటు చేశారు. "

- లావ్​ అగర్వాల్​, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

వ్యాక్సిన్​ తయారీకి రెండేళ్లు

కరోనాను ప్రపంచ ప్రమాదకర వ్యాధిగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయటం కఠిన సమస్యగా పేర్కొన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్​ అభివృద్ధి చేసేందుకు సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు సమయం పడుతుందని స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్​ చనిపోతుందా అని అడిగిన ప్రశ్నకు.. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు, నివేదికలు లేవని తెలిపారు.

డబ్ల్యూహెచ్​ఓ సూచనలకు అనుగుణంగా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు అనుగుణంగా కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు. దేశంలో పాజిటివ్​గా తేలిన 73 మందితో సంబంధాలు ఉన్న సుమారు 1,500 మందిని పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. భారత్​లోని 30 గుర్తింపు పొందిన విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 10.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.

ఇరాన్​కు మరో మూడు విమానాలు..

ఇరాన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు వచ్చే మూడు రోజుల్లో మరో మూడు విమానాలు వెళ్లనున్నాయని తెలిపారు అధికారులు. విదేశాల్లోని భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కరోనాతో అప్పుడు 70వేలు.. ఇప్పుడు 62వేలు

Last Updated : Mar 12, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details