తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 6:30 PM IST

Updated : Oct 1, 2019, 5:52 AM IST

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ పీడకు విరుగుడు ఏదీ?

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌కు చరమగీతం పాడి.. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనజాగృత కార్యక్రమాల ద్వారా పౌరులే స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను నిషేధించడాని ప్రోత్సహించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ప్లాస్టిక్‌ పీడకు విరుగుడు-జనజాగృత కార్యక్రమాల ద్వారానే

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనల్ని 2022 నాటికల్లా పూర్తిగా పరిహరించాలన్న ప్రధాని మోదీ ఆశయాన్ని అమలులోకి తెచ్చేలా కేంద్రప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతి నాడు శ్రీకారం చుట్టనున్న ‘ప్లాస్టిక్‌ రహిత భారతావని’ పథకానికి పూర్వరంగం సిద్ధంచేస్తూ- ప్లాస్టిక్‌ సంచులు, థర్మోకోల్‌ ప్లాస్టిక్‌లతో తయారుచేసే చిన్నకప్పులు, ప్లేట్ల వంటివాటి ఉత్పత్తిని నిలిపివేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

పనిలో పనిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు, ఆఫీసులు ప్లాస్టిక్‌తో తయారైన పూలు, బ్యానర్లు, జెండాలు, ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలు, ఫైళ్లు తదితరాలన్నింటినీ త్యజించాలనీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కోరుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనలపై స్పష్టమైన నిర్వచనాన్ని కేంద్ర సర్కారు ఇంకా నిర్దేశించకపోయినా కాలుష్య నియంత్రణ మండలి 12 వస్తూత్పాదనలతో జాబితాను సిద్ధంచేసింది.

పునర్వినియోగం కాని పచారీ సరకుల సంచులు, సీసాలు, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, చిన్నకప్పులు, గిన్నెల వంటివన్నీ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనలుగా ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. ఆ నిర్వచనాన్నే భారత ప్రభుత్వమూ అనుసరిస్తే ప్లాస్టిక్‌ పరిశ్రమతోపాటు, ఆర్థిక రంగమూ అవస్థల పాలవుతుందని తయారీదారుల సంఘం మొత్తుకొంటుంటే, మంచినీళ్ల పెట్‌ సీసాలను ఆ పరిధి నుంచి మినహాయించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌కు చరమగీతం పాడి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల అభివృద్ధికి; సమర్థంగా ప్లాస్టిక్‌ సేకరణ, నిరపాయకరంగా నిర్మూలనకు ప్రధాని మోదీ ఇటీవల ప్రపంచ సదస్సులోనూ కట్టుబాటు చాటడం తెలిసిందే. ప్రజల రోజువారీ అవసరాల్లోకి, పారిశ్రామిక రంగంలోని భిన్న పార్శ్వాల్లోకి చొచ్చుకుపోయిన ప్లాస్టిక్‌ను నియంత్రించడం అన్నది- అసలే దేశార్థికం మందగమనంలో ఉన్న తరుణంలో ప్రభుత్వాలకు తలకు మించిన పనే. ప్లాస్టిక్‌ వ్యర్థాలు విసరుతున్న సవాలును వాణిజ్యావకాశంగా మలచుకోవడమే బహుళ ప్రయోజనకరమంటున్న నిపుణుల సూచనలు ఏ మాత్రం తోసిపుచ్చలేనివి!

గణాంకాలు

ఏడు దశాబ్దాల నాడు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల టన్నులున్న ప్లాస్టిక్‌ ఉత్పాదనలు 2015 నాటికి 38 కోట్ల టన్నులకు విస్తరించగా ఇప్పటికి మొత్తం 830 కోట్ల టన్నుల ఉత్పత్తి సాగింది. అందులో 630 కోట్ల టన్నులు వ్యర్థాలై పోగుపడగా, ఏటా దాదాపు కోటీ 30 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలకు చేరుతున్నాయి. సముద్ర జలాల్ని విషకలుషితం చేసి జలచరాల్ని కబళిస్తూ, మనుషుల హార్మోన్లలోకీ చొరబడి రోగగ్రస్తం చేస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతమొందించాలని నిరుటి ధరిత్రీ దినోత్సవాన ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి.

మొత్తం ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో దాదాపు సగం ఒక్కసారి వాడి పారేసేవే కావడం, 450-1000 సంవత్సరాల పాటు క్షయం కాని లక్షణం ఆయా ఉత్పాదనల్ని జీవావరణానికి పెనుముప్పుగా మార్చేస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాల ప్రకారం 1996లో ఇండియాలో 61 వేల టన్నులుగా ఉన్న ప్లాస్టిక్‌ వినియోగం 2017 నాటికి కోటీ 78 లక్షల టన్నులకు పెరిగింది కానీ అమెరికా (109 కిలోలు), ఐరోపా దేశాలు (65 కిలోలు), చైనా (45 కిలోలు), బ్రెజిల్‌ (32 కిలోలు) తలసరి వాడకంతో పోలిస్తే ఇక్కడ అది 11 కిలోలే! ప్లాస్టిక్‌ వ్యర్థాల విసర్జనపరంగా 2010లో చైనా దాదాపు 5.9 కోట్ల టన్నులు, అమెరికా 3.8 కోట్ల టన్నులతో పోలిస్తే ఇండియా వాటా పట్టుమని 45 లక్షల టన్నులే!

అయినప్పటికీ ప్లాస్టిక్‌ వ్యర్థాల పునశ్శుద్ధి తగినంతగా లేక, సక్రమ నిర్వహణా కానరాక అంతర్జాతీయంగా అభాసుపాలవుతున్న భారత్‌- దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పర్యావరణంతో పాటు జనారోగ్యమూ దెబ్బతింటుందన్న ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమర్థంగా సేకరించి పునశ్శుద్ధి చెయ్యడమే బహుళ ప్రయోజనకరమంటున్న విశ్లేషణల నేపథ్యంలో, దీర్ఘకాల వ్యూహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగేయాలి!

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ పోగుపడుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల రాశి దాదాపు 26 వేల టన్నులు. అందులో 10,400 టన్నుల దాకా వ్యర్థాల్ని అసలు సేకరిస్తున్న నాథుడే లేడు! ఎక్కడికక్కడ అత్యంత ప్రమాదకరంగా పేరుకుపోతున్న ఈ వ్యర్థాల్ని తిని నరకయాతన అనుభవిస్తూ ఏటా వేల సంఖ్యలో పశువులు కనుమూస్తుంటే, పౌరుల నరనరాల్లో ఇంకుతున్న ప్లాస్టిక్‌ దుష్ప్రభావాలు భయానక వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్ని నిషేధించడమో, ఉత్పత్తిదారులే తిరిగి సేకరించే పద్ధతిని పరిశీలించడమో చేయకపోతే భావితరానికి అణ్వస్త్రాన్ని మించిన పెనుముప్పు దాపురిస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంతటి ముప్పును తప్పించేలా చేపట్టే కార్యాచరణ విదేశీ అనుభవాల్నీ పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయంగా సమగ్రంగా ఉండాలి! ప్రపంచంలోనే ప్రశస్తమైన పునశ్శుద్ధి వ్యవస్థగల స్వీడన్‌- ప్లాస్టిక్‌ నిషేధం ఊసెత్తకుండా వ్యర్థాల నుంచి నయా ఉత్పాదనల సృష్టితో పురోగమిస్తోంది

2002లోనే ప్లాస్టిక్‌ సంచులపై పన్ను వేసి ఐర్లాండ్‌, దుకాణాదారులు ఆ సంచుల్ని ఉచితంగా ఇవ్వరాదన్న చట్టం చేసి చైనా లక్ష్యసాధనకు ఉపక్రమించాయి. ఇండియా మాదిరిగానే ఫ్రాన్స్‌ రోజువారీ వినియోగించే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాల్ని కనిపెట్టాలని ఐఐటీ విద్యార్థుల్ని కోరిన ప్రధాని, ఆ వ్యర్థాలతో పటిష్ఠ రహదారుల నిర్మాణ సాంకేతికతకు ప్రాచుర్యం లభించేలా చూడాలి! వేలాది ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో లక్షలమంది ఉపాధిని దృష్టిలో ఉంచుకొని, వ్యర్థాల సేకరణ, శుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాటితోపాటే జనజాగృత కార్యక్రమాల ద్వారా పౌరులే స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను నిషేధించే వాతావరణాన్ని సృష్టించినప్పుడే- ఆ పీడ విరగడ అవుతుంది!

ఇదీ చూడండి : 9 మోర్టార్​​ షెల్స్​ను ధ్వంసం చేసిన భారత సైన్యం

Last Updated : Oct 1, 2019, 5:52 AM IST

ABOUT THE AUTHOR

...view details