తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవత్వం చేరదీసింది.. పచ్చదనం వెల్లివిరిసింది - 'సెంటర్​ పర్​ డెస్టిట్యూట్స్ గోనూరు

కన్న తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం పెట్టలేని బిడ్డల కాఠిన్యం వారిని ఇంట్లోనుంచి తరిమేస్తే.. కర్ణాటకలోని ప్రభుత్వాధికారుల ఔదార్యం అటువంటి వారందరికీ ఆశ్రయం కల్పించింది. అదే 'సెంటర్​ పర్​ డెస్టిట్యూట్స్'. అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తూనే... బీడు భూమి పచ్చని పంటగా మారేందుకు కారణమైంది.

Destitutes become self-reliant..A green Gonoor story in karnataka chitradurda
మానవత్వం చేరదీసింది.. పచ్చదనం వెల్లివిరిసింది

By

Published : Jan 27, 2020, 6:52 AM IST

Updated : Feb 28, 2020, 2:35 AM IST

మానవత్వం చేరదీసింది.. పచ్చదనం వెల్లివిరిసింది

ఒకప్పుడు వారందరిదీ నిలువ నీడ లేని పరిస్థితి. ఆకలేస్తే పట్టెడన్నం పెట్టే దిక్కు లేని దౌర్భాగ్యం. ఆరోగ్యం బాగోలేకపోతే పట్టించుకునే వారే లేని దుస్థితి. ఎందుకంటే వారంతా కన్న బిడ్డలు కాలదన్నిన తల్లిదండ్రులు.

అయితే.... రక్తసంబంధం వెలివేసిన వారిని మానత్వం చేరదీసింది. అనాథగా మారిన వృద్ధుల జీవితాలను తిరిగి గౌరవంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిచారు కర్ణాటకలోని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు. చిత్రదుర్గ గోనూరులో 'సెంటర్​ పర్​ డెస్టిట్యూట్స్' ఆశ్రమాన్ని స్థాపించి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపారు.​

"ఎంతో మంది యాచకులు, నిరాశ్రయ వృద్ధులను ఈ ఆశ్రమం చేరదీసింది. వారికి అవసరమైన చికిత్స అందిస్తూ వారి సంక్షేమాన్ని చూసుకుంటోంది. వీరంతా ఇప్పుడు గౌరవమైన జీవితాన్ని గడపుతున్నారు."
-భాగ్యమ్మ, ఆశ్రమ సిబ్బంది

పచ్చగా మార్చేశారు..

చిత్రదుర్గ శివారులోని ఈ గోనూరు ప్రాంతం పదేళ్ల క్రితం ఎందుకూ పనికిరాకుండా పడి ఉన్న ఓ బంజరు భూమి. కానీ, ఇప్పుడు పచ్చని చీర కట్టుకుంది. ఇందుకు కారణం సెంటర్​ ఫర్​ డెస్టిట్యూట్స్​లోని వృద్ధులే.

ఇక్కడ వృథాగా పడి ఉన్న నేలలో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల పంటలు వేసి సస్యశ్యామలంగా మార్చేశారు ఈ వయోజనులు. ఉదయం లేవగానే పాడి పశువులకు నీరు, ఆహారం పెడతారు. ఆ తరువాత ప్రకృతి సేద్యం చేస్తారు. సమయానికి భోంచేస్తారు. ఆడుతూ.. పాడుతూ కష్టాలు మరచిపోతారు.

ప్రతిఫలం..

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలకు కృతజ్ఞత లేదేమో గానీ.. నీరు పోసి పెంచుకున్న ప్రకృతి తమను కడుపున దాచుకుంటోంది. వారు పండించినదానికి ప్రతిఫలం సరాసరి వారి ఖాతాల్లోనే పడుతుందంటున్నారు ఆశ్రమ అధికారులు.

"ఇక్కడున్న చాలా మంది అనాథలు. ఇక్కడ వారు పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. మేము వాటిని విక్రయించి.. వచ్చిన ఆదాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. వారు ఈ ఆశ్రమం​ నుంచి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఈ డబ్బులు వారికి ఉపయోగపడతాయి."
-మహదేవయ్య, ఆశ్రమ అధికారి

ఇదీ చదవండి:ట్రాఫిక్​ రూల్స్ బుక్​లెట్​ను తలపించిన శుభలేఖ

Last Updated : Feb 28, 2020, 2:35 AM IST

ABOUT THE AUTHOR

...view details