ఎన్ని ఆందోళనలు చేపట్టినా పౌరచట్టంపై వెనక్కి తగ్గేది లేదన్నారు భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా. పౌరచట్టానికి మద్దతుగా ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో జన్జాగరణ్ అభియాన్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు షా. ధైర్యముంటే సీఏఏపై బహిరంగ చర్చకు రావాలని విపక్షాలకు సవాల్ విసిరారు.
పౌరచట్టంతో ఎవరి పౌరసత్వాన్ని తొలగించబోమని పునరుద్ఘాటించారు భాజపా అగ్రనేత. ఓటుబ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని , వాస్తవాలు గ్రహించడం లేదన్నారు.
"పౌరచట్టానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆయన అనుచరులు, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయవతి అంతా కలిసి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తర్ప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వచ్చాను. పౌరచట్టం కారణంగా ముస్లిం ప్రజలు, మైనారిటీల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లును నేనే సభలో ప్రవేశపెట్టాను. విపక్షనేతలూ.. మీకు ధైర్యముంటే ఓ ఉమ్మడి వేదిక చూపెట్టండి. సీఏఏపై చర్చిద్దాం. పౌరచట్టం ద్వారా ఎవరి పౌరసత్వమైనా రద్దయితే అది నాకు చూపండి."