కరోనా ప్రభావం పార్లమెంటు సమావేశాలపైనా పడింది. బడ్జెట్ సెషన్‌ను కరోనా వ్యాప్తి దృష్ట్యా 10 రోజుల ముందుగానే ముగించినా.. ఇప్పుడు వర్షాకాల సమావేశాలూ నిర్ణయించిన సమయానికి జరుగుతాయా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. కారణం... కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం. ఈ ఆందోళనల నడుమ స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. వర్షాకాల సెషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని చూస్తున్నట్లు చెప్పారు.
కొవిడ్-19 కారణంగా ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించిన బిర్లా.. పార్లమెంటు సమావేశాలు సకాలంలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సాధారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో నిర్వహిస్తారు. గతేడాది జూన్ 20- ఆగస్టు 7 మధ్య మాన్సూన్ సెషన్ జరిగింది.