అయోధ్యలో నిర్మించనున్న మసీదు ఆకృతిని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) శనివారం.. విడుదల చేసింది. మసీదుతో పాటు 200 పడకల ఆస్పత్రి, సామూహిక భోజనశాల, అధునాతన గ్రంథాలయ కాంప్లెక్స్ డిజైన్‌ను సైతం విడుదల చేసింది.
నూతన సాంకేతికత ఉపయోగించి మసీదు డిజైన్ రూపొందించినట్లు జామియా మిలియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ తెలిపారు. విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన.. మసీదు విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.
"మసీదు డిజైన్ అధునాతన సాంకేతికత ఆధారంగా రూపొందించాం. దీర్ఘ వృత్తాకార ఆకారంలో గుమ్మటం లేకుండా మసీదు ఉంటుంది. రెండంతస్తుల మసీదులో ఎలాంటి మినార్లు(పొడవైన స్తంభంలాంటి నిర్మాణాలు) ఉండవు. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేసుకోవచ్చు."
-ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్, జామియా మిలియా యూనివర్సిటీ
అన్ని రకాల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.