కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గన్‌మెన్, పోలీసులు ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం ధర్మె గౌడ మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. సమీపంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దేవెగౌడ దిగ్భ్రాంతి
ఉపసభాపతి అకాల మరణంపై మాజీ ప్రధాని దేవెగౌడ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ధర్మె గౌడ ప్రశాంతమైన వ్యక్తి అని.. రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందని పేర్కొన్నారు.
ఇదే కారణమా..?
డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్(మండలి) సమావేశాల్లో గందరగోళంజరిగింది. ఛైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. మాటల దాడులతో పాటు ఒకరినొకరు తోసివేసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మె గౌడను ఛైర్మన్ సీటు నుంచి సభ్యులు తోసేశారు.