కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పెట్టుబడిదారులైన కొంతమంది మిత్రులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితం ఆ నిర్ణయం తీసుకున్నారని, అది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.
నోట్ల రద్దు చేపట్టిన రోజును విద్రోహ దినంగా పాటిస్తోంది కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన.. 'నోట్ల రద్దు సంక్షోభానికి వ్యతిరేకంగా గళం విప్పాలి' అనే కార్యక్రమంలో భాగంగా ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్ గాంధీ.
" ఆర్థిక వ్యవస్థ క్షీణతకు ప్రభుత్వం కొవిడ్‌ను కారణంగా చూపుతోంది. అదే కారణమైతే.. బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచం మొత్తం కరోనా ఉంది. కరోనా కారణం కానేకాదు. కేవలం నోట్ల రద్దు, జీఎస్టీలే ప్రధాన కారణం. భారత ఆర్థిక వ్యవస్థపై దాడి చేయటాన్ని ప్రధాని మోదీ నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీశారు. ఆర్థిక వ్యవస్థ 2 శాతం క్షీణిస్తుందని గతంలోనే మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. నోట్ల రద్దు అనేది దేశంలోని నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకని ప్రధాని చెప్పారు. కానీ, దాని ఉద్దేశం అది కాదు. ప్రజల నుంచి డబ్బును తీసుకుని కేవలం 2-3 మంది పెట్టుబడిదారులైన మిత్రులకు ఇవ్వడమే అసలు లక్ష్యం. నగదు కోసం సామాన్యులే క్యూలో నిలుచున్నారు కానీ, పెట్టుబడిదారీ మిత్రులు కాదు. మీరు బ్యాంకులో వేసే సొమ్మును, ప్రధాని మోదీ తన స్నేహితులకు ఇచ్చారు. సుమారు రూ.3,50,000 కోట్ల రుణాలు మాఫీ చేశారు. "