తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రానికి హిమాలయ పర్వత రాష్ట్రాల డిమాండ్‌

ప్రగతి పరుగులో వెనుకబడ్డ హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలు తమ దుస్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నాలు మెుదలు పెట్టాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలన్ని ఒకచోట సమావేశమై తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని నిర్ణయించాయి. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్​లోని ముస్సోరీ వేదికైంది.

By

Published : Aug 13, 2019, 5:04 PM IST

Updated : Sep 26, 2019, 9:22 PM IST

ప్రత్యేక శాఖతోనే ప్రగతి - హిమాలయ పర్వత రాష్ట్రాల డిమాండ్‌

అభివృద్ధిలో దేశంలోని పదకొండు హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలు వెనకబాటులో ఉన్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగా గత నెలాఖరులో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో సమావేశమయ్యాయి. వెనకబాటుకు గల కారణాలు, భౌగోళిక పరిమితులు, ఇబ్బందుల గురించి చర్చించాయి. ఆదాయ వనరుల పంపిణీలో అన్ని రాష్ట్రాల మాదిరిగా తమను పరిగణించరాదని, కేంద్రం ప్రత్యేక దృష్టితో చూడాలని, ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ చొరవతో జరిగిన సమావేశానికి పది రాష్ట్రాలు హాజరయ్యాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ (ప్రస్తుతం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటైంది) సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరమ్‌, మేఘాలయ, మణిపూర్‌, త్రిపురకు హిమాలయ పర్వత రాష్ట్రాలుగా పేరుంది. సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌, పదిహేనో ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎన్‌.కె.సింగ్‌ ముందు తమ డిమాండ్లను ఉంచారు. ‘ముస్సోరీ’ తీర్మానంగా ఈ డిమాండ్లు గుర్తింపు పొందాయి.

పర్వతాలు, కొండలు, నదులతో విస్తరించిన హిమాలయ రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడిన మాట వాస్తవం. ఆదాయ వనరుల లేమి ఇందుకు ప్రధాన కారణం. వరదలు, తుపాన్లు, కరవు వంటి సమస్యలతో అవి తరచూ సతమతమవుతుంటాయి. కొద్దిపాటి వనరులతో అభివృద్ధి సాధించడం, ప్రకృతి ఉత్పాతాలను ఎదుర్కోవడం వాటికి శక్తికి మించిన పని అవుతోంది. ఇటీవల బ్రహ్మపుత్ర వరదలు అసోమ్‌ను అతలాకుతలం చేశాయి. భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించాయి. 2014లో జమ్మూకశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. రాజధాని నగరం శ్రీనగర్‌లోకి వరద జలాలు ప్రవేశించడంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. ఏటా జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వాసులు ‘మంచు’ కష్టాలు ఎదుర్కోవడం ఆనవాయితీగా మారింది.

హిమాలయ పర్వత రాష్ట్రాల్లో విస్తృతమైన జలవనరులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ అభివృద్ధి ‘ఎక్కడవేసిన గొంగడి...’ చందంగా ఉంది. మిగులు విద్యుత్‌ విక్రయం ద్వారా సిక్కిం అభివృద్ధికి నిధులు పొందవచ్చని పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచనలు సాగాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు. 2000లో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్‌ నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. చార్‌థామ్‌ యాత్రలో భాగమైన ఇక్కడి కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినా సరైన రోడ్లు, మౌలిక సౌకర్యాలు విస్తరించలేదు. గంగానది వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీజలాలను సద్వినియోగం చేసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో అతి పెద్దదైన అసోమ్‌ రూపురేఖలే మారిపోతాయి. ఈశాన్య భారత్‌ను ఆగ్నేయాసియా వాణిజ్య కూడలిగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి సాధించగలదు. భూతలస్వర్గమైన కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడితే పర్యాటక ఆదాయం, అమర్‌నాథ్‌, మాతా వైష్ణోదేవిని సందర్శించే భక్తుల సంఖ్యా పెరుగుతాయి.

భౌగోళికంగా హిమాలయ పర్వత రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌ పాకిస్థాన్‌తో సరిహద్దులు కలిగి ఉంది. రెండు దేశాల మధ్యగల నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూ ఉంటాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వీరి భద్రతకు ఉపయోగపడే బంకర్లు తగినన్ని లేవన్నది చేదునిజం. సరిహద్దు ప్రాంతాల ప్రజలు భారతీయ సైన్యానికి వేగుల్లా ఉపయోగపడతారు. 1999లో కార్గిల్‌ ప్రాంతంలోకి పాకిస్థాన్‌ ముష్కరుల చొరబాటు గురించి ముందుగా సమాచారం అందించింది స్థానిక గొర్రెల కాపరులే. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు చైనాతో కొద్దిపాటి సరిహద్దు కలిగిఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌, చైనా, మియన్మార్‌, భూటాన్‌, నేపాల్‌లతో సరిహద్దులు కలిగి ఉన్నా ఆయా దేశాలతో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు.

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఈ ప్రాంత యువత పెద్దయెత్తున వలసబాట పడుతోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బతుకుతెరువు కోసం పొట్టచేత పట్టుకుని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు తరలిపోతుంటారు. భవన నిర్మాణ పనులు, ఇతర చిన్నాచితక ఉద్యోగాలతో జీవనం సాగిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ యువత దిల్లీ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలి వెళ్లడం నిత్యకృత్యంగా మారింది.

ప్రస్తుతం పన్నుల వాటాలో 42 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ మొత్తాన్ని 50 శాతానికి పెంచాలన్నది వీటి ప్రధాన డిమాండ్‌. ఈ విషయంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో తమను పరిగణించడం సరికాదన్న వాటి వాదన సహేతుకమైనదే. తమ బడ్జెట్లో 7.5 శాతాన్ని కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా, ఈ మొత్తాన్ని 15 శాతానికి పెంచాలని ఈ రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని దాదాపు 900 హిమానీనదాలు దేశంలో జలవనరులకు ఆధారంగా ఉన్నాయి. ఇక్కడి అడవులు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి. అందువల్ల తమకు అదనంగా నిధులు ఇవ్వాలన్న వీటి అభ్యర్థనను తోసిపుచ్చలేం! జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లను మినహాయిస్తే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. వాజ్‌పేయీ హయాములో 2001లో దీన్ని ఏర్పాటు చేశారు. జితేంద్ర సింగ్‌ సారథిగా ఉన్న ఈ మంత్రిత్వశాఖ వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయం ఆయా రాష్ట్రాల్లో ఉంది. దీని స్థానంలో హిమాలయ పర్వత రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అవి కోరుతున్నాయి!

- జి. మారుతీలత

ఇదీ చూడండి:'కశ్మీర్​'పై తక్షణ జోక్యానికి సుప్రీం నిరాకరణ

Last Updated : Sep 26, 2019, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details