ఆరు గజాల ఇంట్లో 4 కుటుంబాల నివాసం! దేశ రాజధాని దిల్లీలోని బురాడీలో అతిచిన్న భవనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం ఆరు గజాల స్థలంలో నిర్మితమైన ఈ మూడంతస్తుల భవనాన్ని చూసేందుకు చుట్టుపక్కలవారు తరలివస్తున్నారు. నగర జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. భూవిస్తీర్ణం తగ్గిపోతోంది. అందుకే తనకున్న ఆరు గజాల స్థలాన్ని విడవకుండా.. ఇలా అందమైన భవనం కట్టేసి అద్దెకు ఇచ్చేశాడు ఈ ఇంటి యజమాని.
"ఈ ఇల్లు కట్టేప్పుడు ఇంత తక్కువ సమయంలో భవనం నిర్మించడం అసాధ్యం అనుకున్నాం. కానీ వారు కట్టి చూపించారు. ఇప్పుడు నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి ఈ ఇంట్లో. అందులో ఒక గది, ఒక వంటగది ఉన్నాయి. ఇది కట్టి ఆరేళ్లయింది."
-స్థానికురాలు
తక్కువ స్థలంలో కట్టారు కదా అని... తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సాధారణ ఇళ్లల్లో ఉండే అన్ని వసతులు ఈ ఇంట్లో ఉన్నాయి. కానీ... కాస్త ఇరుకుగా.
"అద్దెకు వచ్చే ముందు ఆరు గజాల ఇళ్లని చెప్పారు. ఇందులో మరుగుదొడ్లు, పడక గదులు, వంటగదులు ఉన్నాయి. ఇంటి మొత్తానికి ఆరు నుంచి ఏడు కిటికీలు ఉంటాయి. ప్రస్తుతం మేము రూ. 3500/- అద్దె చెల్లిస్తున్నాం. నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి. "
- అద్దెకు ఉంటున్న మహిళ
ఇదీ చూడండి:బిడ్డకు కాలు విరిగితే బొమ్మకు కట్టుకట్టించిన తల్లి!