దేశ రాజధానిలో ట్రంప్ పర్యటించనున్న వేళ మరోసారి పౌరసత్వ అల్లర్లు చెలరేగాయి. సోమవారం రాత్రి చెలరేగిన హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పౌరసత్వ చట్టం అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దిల్లీ సోమవారం మరోసారి అట్టుడికింది. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలకు ఓ హెడ్ కానిస్టేబుల్ సహా ఐదుగురు బలయ్యారు. నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. ఆస్తులకు నిప్పుపెట్టారు. పెట్రోల్ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులనూ వదల్లేదు. వారిపై రాళ్ల వర్షం కురిపించారు. రెండు రోజులుగా సాగుతున్న నిరసనలతో దిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్పుర్లు దద్దరిల్లాయి. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు.
అల్లర్లలో ఓ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మరణించాడు. మరో నలుగురు పౌరులు కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 105 మంది గాయపడ్డారు. జాఫ్రాబాద్లో ఓ ఆందోళనకారుడు తుపాకీతో కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
మార్కెట్‌కు నిప్పు...
ఈశాన్య దిల్లీలో జరిగిన పౌర చట్ట వ్యతిరేక ఆందోళనల్లో హింస చెలరేగిన సమయంలోనే.. గోకుల్‌పురి వద్ద టైర్ మార్కెట్‌కు ఆందోళనకారులు నిప్పంటించారు. రాత్రి 8.30కు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 15 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి 12 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలు షాపులు దగ్ధమయ్యాయి.