ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో మృతుల సంఖ్య 32కు పెరిగింది. తాజాగా మరో ఐదుగురు మృతి చెందినట్లు గురుతేగ్ బహదూర్ ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
పౌరసత్వ చట్టం అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య జరిగిన అల్లర్లతో మూడు రోజులుగా ఈశాన్య దిల్లీ అట్టుడుకుతోంది. ఇంకా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. రోడ్లపై భద్రతాదళాలు మినహా జనసంచారం లేదు.
హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్యదిల్లీలో దుకాణాలు, పాఠశాలలు, మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈశాన్య, తూర్పు దిల్లీలో ఇవాళ జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేశారు.
19 ఫోన్లు
అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8 లోపు ఘర్షణలు జరిగిన ప్రాంతాల నుంచి 19 ఫోన్లు వచ్చినట్లు దిల్లీ అగ్నిమాపకశాఖ తెలిపింది. 100కు పైగా సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అదనపు అగ్నిమాపక వాహనాలను తరలించినట్లు పేర్కొంది.