రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ దిల్లీ అల్లర్లకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు కాంగ్రెస్ నేతలు. దిల్లీలో శాంతి నెలకొని సాధారణ పరిస్థితులు రావాలని రాష్ట్రపతిని కోరింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నాయకుల బృందం.
ఈ మేరకు కోవింద్‌కు వినతి పత్రం సమర్పించింది కాంగ్రెస్ ప్రతినిధుల బృందం. రాష్ట్రపతిని కలిసిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు కాంగ్రెస్ నేతలున అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు.
షాను తొలగించాలి..
మా డిమాండ్లను రాష్ట్రపతి పరిశీలనలోకి తీసుకున్నారని.. ఆయనతో భేటీ సంతృప్తిని ఇచ్చిందని సోనియా తెలిపారు.
"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్న హింసను మౌనంగా చూస్తుండిపోయారు. హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 34 మంది చనిపోయారు. 200 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం మీపైన ఉంచింది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తొలగించాలని పునరుద్ఘాటిస్తున్నాం."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
34కు చేరిన మృతులు..
ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 34 మంది మరణించారు. మూడురోజులుగా అట్టుడికిన ఈశాన్య దిల్లీలో కొన్నిప్రాంతాల్లో క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటున్నా.. మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య దిల్లీలో దుకాణాలు, పాఠశాలలు, మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈశాన్య, తూర్పు దిల్లీలో ఇవాళ జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేశారు.