రిపబ్లిక్ డే వేడుకల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. దిల్లీలో 6 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు వింటేజ్ పాయింట్లలో ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే, రాజ్‌ఘాట్ వద్ద చురుకైన సిబ్బందిని పీపీఈ కిట్లు, మాస్క్, ఫేష్ షీల్డ్‌లతో మోహరిస్తున్నామని తెలిపారు. రాజ్‌పథ్ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కి.మీల మార్గంలో నిఘా ఉంచేందుకు వీలుగా ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లు, స్నైపర్స్ గస్తీ కాస్తారన్నారు. దిల్లీ చుట్టూ సరిహద్దు ప్రాంతాల వద్ద ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే: దిల్లీలో భద్రత కట్టుదిట్టం - రాజ్‌పథ్ భద్రత
రిపబ్లిక్ డే సందర్భంగా దిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఆరు వేల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. రాజ్‌పథ్ నుంచి కవాతు జరిగే దాదాపు 8 కి.మీల మార్గంలో నిఘా ఉంచేందుకు వీలుగా ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లు, స్నైపర్స్‌ను మోహరించారు.

ఏటా రిపబ్లిక్‌డే వేడుకలకు లక్ష మందికి పైగా హాజరైనప్పటికీ ఈసారి మాత్రం కరోనా నిబంధనలకు అనుగుణంగా 25వేల మంది మాత్రమే హాజరవుతారని పోలీసులు తెలిపారు. ఎర్రకోట వరకు జరగాల్సిన పరేడ్ కూడా నేషనల్ స్టేడియం వరకే నిర్వహించనున్నారు. ఎర్రకోట వద్ద కేవలం శకటాలకు మాత్రమే అనుమతించనున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే ప్రదేశంలో 140 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. రాజ్‌పథ్‌లోకి జనం ప్రవేశించే పాయింట్ల వద్ద 30 చోట్ల ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఈ వ్యవస్థలో దాదాపు 50వేల మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులు, నేరస్థులు, సంఘవిద్రోహక శక్తులకు సంబంధించిన డేటాబేస్ ఉంటుందని చెప్పారు.