దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్ దేశ రాజధాని దిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నగరవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగర వాసులు మాస్క్‌లు లేకుండా బయట తిరిగే పరిస్థితులు లేవు. శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చిన్న పిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.
శుక్రవారం మధ్యాహ్నానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 480గా నమోదైంది. సాధారణంగా ఏక్యూఐ 100 పాయింట్లలోపు ఉంటే వాతావరణం సంతృప్తికర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు.
ఆరోగ్య అత్యవసర పరిస్థితి..
వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కాలుష్య నివారణ ప్రాధికార కమిటీ(ఈపీసీఏ). దిల్లీని ఆరోగ్య అత్యవసర పరిస్థితి కలిగిన ప్రాంతంగా ప్రకటించింది. నేటి నుంచి 5వ తేదీ వరకు రాజధానిలో ఎటువంటి భవన నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని ఆదేశించింది. దిల్లీ ఎన్సీఆర్ ప్రాతంలో మతాబులు, పటాసులు పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
పాఠశాలలకు సెలవులు..
కాలుష్యం తీవ్రరూపం దాల్చిన కారణంగా దిల్లీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈనెల 5 వరకు విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
అంతకుముందు విద్యార్థులకు సుమారు 50 లక్షల 'ఎన్95' మాస్క్‌లను పంపిణీ చేశారు కేజ్రీవాల్.
ఇదీ చూడండి: ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల నగారాకు రంగం సిద్ధం