తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెండు రోజుల్లో దిల్లీ అల్లర్ల 'కుట్ర' కేసు ఛార్జిషీట్'

దిల్లీ అల్లర్లలో కుట్ర కేసుకు సంబంధించి సెప్టెంబర్ 17 నాటికి ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్​ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. 'ప్రణాళికబద్ధమైన కుట్ర' ఫలితంగానే అల్లర్లు చెలరేగాయని డీసీపీ కుష్వాహా పేర్కొన్నారు. నిరసనకారులు అన్ని ప్రాంతాల్లో ఒకే విధానం అవలంబించిన కారణంగా కుట్ర కోణాన్ని గుర్తించినట్లు చెప్పారు.

Delhi riots: Charge sheet in conspiracy' case will be filed by Sept 17, says police chief
'రెండు రోజుల్లో దిల్లీ అల్లర్ల 'కుట్ర' కేసు ఛార్జిషీట్'

By

Published : Sep 15, 2020, 5:48 AM IST

ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసులో 'కుట్ర' కేసుకు సంబంధించి గురువారం(సెప్టెంబర్ 17) నాటికి ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్​ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుందని వెల్లడించారు.

దిల్లీ పోలీసు విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన వెబినార్​లో శ్రీవాస్తవతో పాటు డీసీపీ(స్పెషల్ సెల్) ప్రమోద్ సింగ్ కుష్వాహా పాల్గొన్నారు. ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లపై పలు కీలక విషయాలు వెల్లడించారు.

751 కేసులు

అల్లర్లకు సంబంధించి మొత్తం 751 కేసులను దిల్లీ పోలీసులు నమోదు చేసినట్లు శ్రీవాస్తవ తెలిపారు. అందులో 340 కేసులు పరిష్కారమయ్యాయని.. మిగిలిన వాటిలో పురోగతి లేదని చెప్పారు. 751 కేసుల్లో ఒక కేసు మాత్రం కుట్రకు సంబంధించినదని వెల్లడించారు. ఈ కేసును క్రైం బ్రాంచీ నమోదు చేసినప్పటికీ.. సమగ్ర విచారణ కోసం స్పెషల్ సెల్​కి బదిలీ చేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 17 నాటికి స్పెషల్ సెల్ ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ కేసులో భాగంగా పోలీసులు విచారిస్తున్న వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్​గా ఉన్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. దర్యాప్తు చివరి దశకు చేరుకుంటున్న క్రమంలోనే ఉమర్ ఖలీద్ అరెస్ట్ అయ్యాడని.. దీనిపై సామాజిక మాధ్యమాలతో పాటు టీవీ ఛానెళ్లలోనూ ప్రతికూల ప్రచారం జరుగుతోందని అన్నారు. విచారణ నుంచి దృష్టి మరల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

కుట్రకు అదే ఆధారం

మరోవైపు.. 'ప్రణాళికబద్ధమైన కుట్ర' ఫలితంగానే ఈ అల్లర్లు చెలరేగాయని విచారణలో తేలిందని డీసీపీ కుష్వాహా పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులు ఎక్కువగా రహదారులపై ట్రాఫిక్​ను అడ్డుకోవడం వంటి విధానాలను అవలంబించారని.. కుట్ర జరిగిందనేందుకు ఇదే తొలి ఆధారమని పేర్కొన్నారు.

"దిల్లీ అల్లర్లపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు నిరసనకారులు అవలంబించిన ఒక విధానాన్ని గుర్తించాం. దాదాపు 25 ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇందులో చాలా ప్రాంతాలు యమనా నది తీరంలోనే ఉన్నాయి. దాదాపు అన్ని ప్రదేశాల్లో ఒకేసారి ట్రాఫిక్ జామ్​లు ప్రారంభమయ్యాయి. ఇదే కుట్ర జరిగింది అని చెప్పేందుకు తొలి సూచన. ఇక్కడి నుంచే అంతా మొదలైంది."

-ప్రమోద్ సింగ్ కుష్వాహా, డీసీపీ

నిరసనలకు నాయకత్వం వహిస్తున్నవారు బయటనుంచి వచ్చినవారేనని డీసీపీ కుష్వాహా తెలిపారు. నిరసనలను సీఏఏ-ఎన్​ఆర్​సీ ఆందోళనలుగా చిత్రీకరించేందుకు వారంతా ఈ రెండు విషయాల గురించే మాట్లాడుకున్నారని చెప్పారు. ఫిబ్రవరి 11న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశాన్ని సందర్శిస్తారని ప్రకటించినప్పుడు, అకస్మాత్తుగా నిరసనకారుల స్వరం, స్వభావం మారిందని అన్నారు.

ఫిబ్రవరి 22న నిరసనకారులు, మహిళలు జఫ్రాబాద్​ మెట్రో స్టేషన్​ వద్ద బైఠాయించి రహదారిని అడ్డగించారని.. ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఈశాన్య దిల్లీలోని మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్​లు ప్రారంభమయ్యాయని కుష్వాహా తెలిపారు. ఆ తర్వాత.. సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న మౌజ్​పుర్​ ప్రాంతంలో రాళ్లు రువ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. ఇదే.. తర్వాత ప్రణాళికబద్ధమైన అల్లర్లుగా మారాయని వెల్లడించారు. యాసిడ్ బాటిళ్లు, పెట్రోల్ బంబులు కూడా ఉపయోగించినట్లు చెప్పారు. సీఏఏ అనుకూల వ్యక్తులు ఇందులో పాల్గొన్నారనే కథనాలు వచ్చాయని.. అయితే ఈ విషయంలో దర్యాప్తులోకి రాలేదని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details