దిల్లీలో అల్లర్లు చెలరేగిన సమయంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన పార్టీలు.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు భాజపా నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. ఈశాన్య దిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్, ఐబీ అధికారి మరణాల పట్ల కాంగ్రెస్, ఆప్ ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు.
దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ నేతలు శాంతి కోసం కృషి చేయాల్సింది పోయి.. మతం ప్రాతిపదికన బాధితులను గుర్తిస్తున్నారని జావడేకర్ విమర్శించారు.
"రెండు రోజుల హింసాత్మక ఘటనల అనంతరం ఈశాన్య దిల్లీలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కుట్రకు కారకులను కచ్చితంగా గుర్తిస్తామన్న విశ్వాసం ఉంది. ఇది రెండు రోజుల్లో చెలరేగిన హింస కాదు. రెండు నెలలుగా ప్రయత్నాలు జరిగాయి. సీఏఏ ఆమోదం పొందిన 3 రోజుల తర్వాత డిసెంబరు 14న రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో సోనియా గాంధీ 'ఇస్ పార్ యా ఉస్ పార్'(తాడో పేడో తేల్చాల్సిందే) అని అన్నారు. వాటి అర్థం ఏంటి? రెచ్చగొట్టడం కాదా?"