లోకల్ స్కెచ్‌తోనే 'ఆప్' సినిమా హిట్ పౌరసత్వంపై దేశవ్యాప్తంగా రగడ. దిల్లీలో అయితే మరీ ఎక్కువ. జేఎన్‌యూ, జామియా మిలియా విశ్వవిద్యాలయాలతో పాటూ షాహీన్‌బాగ్‌లో నిరసనలు తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. ఇవే హస్తిన అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయనుకున్నారంతా. అయితే.. పరిస్థితులు మారినా అదే ఫలితం. దిల్లీ ఓటర్లు మరోసారి 'స్థానికం'వైపే మొగ్గుచూపారు. ఆప్‌ను అందలమెక్కించారు.
భాజపా జాతీయవాదం పనిచేయలేదు. పౌర నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన 'చీపురు పార్టీ'పైనే నమ్మకముంచారు దిల్లీవాసులు.
అయితే.. ఆప్ విజయానికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక అంశాలు కళ్ల ముందు మెదులుతాయి. స్థానిక సమస్యలపైనే కేజ్రీవాల్ సేన దృష్టి పెట్టడం వీటిలో ప్రధానం.
స్థానిక సమస్యలు...
ఎన్నికల విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు దిల్లీ ఓటర్లు. స్థానిక, జాతీయ స్థాయి అంశాల మధ్య వ్యత్యాసం చూపిస్తుంటారు. ఓ రకంగా... 'కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేజ్రీవాల్' అనే సూత్రాన్ని అవలంబిస్తుంటారు. శాసనసభ ఎన్నికల వేళ పార్టీ వ్యూహాలన్నీ స్థానిక సమస్యలపైనే కేంద్రీకృతం చేసిన ఆప్‌కు ఇదే కలిసొచ్చింది.
ఐదేళ్ల పాలన, ఉచిత హామీలు..
అభివృద్ధి... రాజకీయాల్లో ఎంతో శక్తిమంతమైన హామీ. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకోగల వాగ్దానం. అదే ఎన్నికల మేనిఫెస్టోలే చేర్చి విస్తృత ప్రచారం నిర్వహించింది ఆప్. 'ఐదేళ్లు అద్భుతంగా సాగాయి. కేజ్రీవాల్‌కు మరోమారు అధికారం ఇచ్చి దాన్ని కొనసాగించండి (అచ్చే బీతె పాంచ్ సాల్. లగే రహో కేజ్రీవాల్)' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ ఐదేళ్లలో అభివృద్ధి పథకాలెన్నో తీసుకొచ్చింది. మహిళా భద్రతకు పెద్ద పీట వేసింది. 2015 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టింది ఆప్ సర్కార్.
మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పానిక్ బటన్స్, జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్, వైద్య, విద్య వంటి రంగాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆప్‌ను ప్రజలకు దగ్గర చేశాయి.
మేనిఫెస్టోలో ఇంకెన్నో....
నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్ సహా కీలకాంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది ఆప్. ఇంటివద్దకే రేషన్, 10 లక్షల మంది వృద్ధులకు ఉచిత తీర్థయాత్రల సౌకర్యం, విధి నిర్వహణలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కృషి వంటి వాగ్దానాలు చేసింది. వీటిపై నమ్మకముంచే ఆప్‌ను మరోమారు గెలిపించారు హస్తిన ఓటర్లు.
భాజపా ఉచ్చుకు దూరం...
పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళనలకు కేంద్రంగా ఉన్న దిల్లీ పరిస్థితుల్ని.. తమ వైపు తిప్పుకోవాలని అనుకుంది భాజపా. షాహీన్‌బాగ్ నిరసనల వెనుక ఆప్ ఉందని ప్రచారం చేసింది. అయితే.. ఆ వ్యూహంలో చిక్కుకోకుండా... నిరసనలకు ఆమడ దూరంలో ఉంది ఆమ్ ఆద్మీ. స్థానిక సమస్యలపైనే దృష్టి సారించి చాకచక్యంగా వ్యవహరించింది. అదే ఆప్‌కు విజయాన్ని కట్టబెట్టింది.
హ్యాట్రిక్ విజయం
2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి.. 2013 దిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు కేజ్రీవాల్. ఆ ఎన్నికల్లో భాజపాకు గట్టిపోటీనిచ్చి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
2015లో ఏకంగా 70కి 67 స్థానాలు గెల్చుకొని జాతీయ పార్టీల ఊసే లేకుండా చేసింది ఆప్. రెండో సారి సీఎంగా ఎన్నికయ్యారు కేజ్రీ.
ఇప్పుడూ అదే ఫలితం. క్రితంతో పోలిస్తే కొన్ని స్థానాలు తగ్గినా సర్కార్ ఆమ్ ఆద్మీదే. హ్యాట్రిక్ విజయాలతో మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు ఆప్ అధినేత.