కరోనా వైరస్ కట్టడిలో దేశరాజధాని దిల్లీ గణనీయ పురోగతి కనబరచిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక్కడ కరోనా వైరస్ రికవరీ రేటు ఆదివారానికి సుమారు 88 శాతానికి చేరుకుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, కొవిడ్ లాక్‌డౌన్ వల్ల కుదేలైన దిల్లీ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు అనేక చర్యలు చేపట్టనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేపట్టనున్న ఆర్థిక పునర్నిర్మాణ చర్యలలో భాగంగా 'రోజ్‌గార్ బజార్' వెబ్‌సైట్‌ను ఆయన నేడు ప్రారంభించారు. దిల్లీలో ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న యువతకు, సిబ్బంది నియామకాలను చేపట్టే యాజమాన్యాలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు తాము ఈ చర్య తీసుకున్నట్టు వివరించారు. ఈ చర్య జాబ్ మార్కెట్ అభివృద్ధికి.. తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపకరిస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కొద్ది రోజుల్లో తమ ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించనున్నట్టు తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్నాం.. ఆర్థికంగా పుంజుకుంటాం!
కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలమైన దిల్లీ... ప్రస్తుతం కోలుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జులై 26 వరకు వైరస్ బాధితుల్లో దాదాపు 88 శాతం మంది కోలుకున్నట్లు వెల్లడించారు. కొవిడ్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
కొవిడ్-19 కేసుల విషయంలో కొద్ది రోజుల క్రితం ఏకంగా రెండవ స్థానంలో ఉన్న దిల్లీ, శనివారం నాటికి 8వ స్థానంలోకి, ఆదివారం 10వ స్థానానికి చేరటం గమనార్హం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలోనూ, తెలంగాణా తొమ్మిదవ స్థానంలోనూ ఉన్నాయి. దిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,606 కాగా, వారిలో 1,14,875 బాధితులు కోలుకున్నారు. శనివారం నాటికి 87.29 గా ఉన్న రికవరీ రేటు ఆదివారం 87.95కి చేరినట్టు దిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,904గా ఉంది. ఇక జూన్‌తో పోలిస్తే, మరణాల రేటు కూడా 44 శాతం మేర తగ్గినట్టు ఆ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:కడుపులో 20 సెం.మీ కత్తి- విజయవంతంగా సర్జరీ