తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్​ నేతలు

Congress
దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్​ నేతలు

By

Published : Mar 4, 2020, 5:08 PM IST

Updated : Mar 4, 2020, 6:35 PM IST

18:30 March 04

అల్లర్లు, ఘర్షణల వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు: రాహుల్‌

అల్లర్లు, ఘర్షణల వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఇటీవల అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య దిల్లీలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం పర్యటించింది. అల్లర్లలో దెబ్బతిన్న ఇళ్లు, పాఠశాలలు, వ్యాపార సముదాయాలను పరిశీలించింది. బాధితులతో మాట్లాడి వారిని రాహుల్‌ బృందం పరామర్శించింది. అల్లర్ల వల్ల ప్రపంచంలో భారత్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని రాహుల్‌ గాంధీ అన్నారు.  

"దేశాన్ని విభజించడం వల్ల, కాల్చడం వల్ల భారత్‌కు, భరతమాతకు ఎలాంటి ప్రయోజం కల్గదు. అంతా కలిసి ప్రేమతో బతికేందుకు, భారత్‌ను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భారత్‌లో, దేశ రాజధానిలో హింస జరిగితే విదేశాల్లో భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. సోదరభావం, ఐక్యత, ప్రేమ అనే భారతదేశ బలాలను ఇక్కడ కాల్చివేశారు. ఇలాంటి రాజకీయాల వల్ల కేవలం కాలిపోయిన ఇక్కడి పాఠశాలకు మాత్రమే కాదు భారతదేశానికి, భరతమాతకు నష్టం జరుగుతుంది. " 

                                                      - రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నేత

18:00 March 04

అల్లర్లతో భారతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు: రాహుల్​

అల్లర్లతో భారత మాతకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని పేర్కొన్నారు రాహుల్​ గాంధీ. దిల్లీ బ్రిజ్​పురిలో అల్లర్లలో ధ్వంసమైన ఓ ప్రైవేటు పాఠశాలను సందర్శించారు రాహుల్​. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'ఈ పాఠశాల దిల్లీ భవిష్యత్తు, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి' అని పేర్కొన్నారు. 

17:55 March 04

బ్రిజ్​పురి చేరుకున్న రాహుల్​ బృందం

ఈశాన్య దిల్లీలోని బ్రిజ్​పురికి చేరుకుంది కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ నేతృత్వంలోని బృందం. అల్లర్ల సమయంలో ధ్వంసమైన ఓ ప్రైవేటు పాఠశాలను సందర్శించనున్నారు నేతలు. బ్రిజ్​పురికి చేరుకున్న నేతలకు స్థానిక కార్యకర్తలు స్వాగతం పలికారు. 

17:44 March 04

మాపై ఒత్తిడి పెరిగింది: కె.సురేశ్​

దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్​ నేతల బృందాల పర్యటనపై పలు విషయాలు వెల్లడించారు ఆ పార్టీ నేత కె.సురేశ్​. ఇప్పటి వరకు కాంగ్రెస్​ ఎంపీలు అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేదన్నారు.కానీ.. ఐయూఎంఎల్​, సీపీఐ ఎంపీలు ఇప్పటికే సందర్శించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల నుంచి ఒత్తిడి పెరిగిందన్నారు. 

17:28 March 04

అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు రెండు బృందాలుగా కాంగ్రెస్​

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ నేతృత్వంలో పలువురు పార్టీ నేతలు దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను అంచనా వేయనున్నట్లు వెల్లడించారు.  

ఈశాన్య దిల్లీలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు గాను రెండు బృందాలుగా ఈ పర్యటన చేపట్టారు. మొదటి బృందంలో హిబి ఎడిన్​, గుర్జీత్​ సింగ్​ ఔజ్లా, అబ్దుల్​ కలేఖ్​ సహా పలువురు ఎంపీలు ఉన్నారు. కేరళ భవనం నుంచి బస్సులో సందర్శనకు బయలుదేరారు.  

రెండో బృందంలో రాహుల్​ గాంధీ, కేసీ వేణుగోపాల్​, అధిర్​ రంజన్​ చౌదరి, కె.సురేష్​, ముకుల్​ వాస్నిక్​, కుమారి సెల్జా, గౌరవ్​ గొగొయి, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా ఉన్నారు. వీరు ఈశాన్య దిల్లీ బ్రిజ్​పురి ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలను సందర్శించనున్నారు. అల్లర్లలో ఈ పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. సుమారు రూ.70 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం గత వారం దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడి పరిస్థితులను అంచనా వేసి నివేదిక సమర్చించింది.  

దిల్లీ అల్లర్లపై పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చ చేపట్టాలని ఇప్పటికే బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా డిమాండ్​ చేస్తోంది కాంగ్రెస్​. 

16:52 March 04

దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్​ నేతలు

కాంగ్రెస్​ నేతల బృందం ఈశాన్య దిల్లీకి బయలుదేరింది. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేక-అనుకూల వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ, అదిర్​ రంజన్​ చౌదరి, రణ్​దీప్​ సుర్జేవాలా, సిద్ధరామయ్య సహా పలువురు నేతలు ఈ బృందంలో ఉన్నారు. 

Last Updated : Mar 4, 2020, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details