తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర'చట్టంపై దిల్లీ జామియా వర్శిటీలో రగడ - DELHI LATEST NEWS

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దక్షిణ దిల్లీలో ఆందోళనకారులు మూడు బస్సులు, అగ్నిమాపక వాహనానికి నిప్పుపెట్టారు. నిరసనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోకి పరుగులు తీశారు. వర్శిటీ కేంద్రంగా విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ జరుగుతోంది.

delhi-protests-aginst-cab
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు

By

Published : Dec 15, 2019, 8:37 PM IST

Updated : Dec 15, 2019, 11:02 PM IST

'పౌర'చట్టంపై దిల్లీ జామియా వర్శిటీలో రగడ

పౌరసత్వ చట్టసవరణపై దిల్లీ జామియా విశ్వవిద్యాలయంలో రగడ చోటుచేసుకుంది. దక్షిణ దిల్లీలో పౌరసవరణపై ఆందోళన చేస్తూ వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. అనంతరం వారు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లారని పేర్కొంటూ వర్శిటీలోకి ప్రవేశించారు పోలీసులు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లోపలికి చొరబడ్డ నిరసనకారులు తప్పించుకోకుండా వర్శిటీ ప్రవేశ ద్వారాలను మూసేశారు. ఘర్షణను చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టు పైనా పోలీసులు దాడి చేశారు.

పోలీసులకు గాయాలు

విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆందోళనలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులతో ఘర్షణకు దిగారు విద్యార్థులు. రాళ్లదాడి చేశారు. ఈ బాహాబాహీలో ఆరుగురు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

'పోలీసులకు అనుమతి లేదు'

విశ్వవిద్యాలయంలోకి పోలీసులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. వర్శిటీలోకి బలగాలను అనుమతించలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులను వర్శిటీ ఖాళీ చేయాలని పోలీసులు లాఠీఛార్జ్​ చేశారని ఆరోపించారు.

ఇదీ జరిగింది

పౌరసత్వ చట్ట సవరణపై దక్షిణ దిల్లీలో ఆందోళనకు దిగారు నిరసనకారులు. మూడు బస్సులు, ఓ అగ్నిమాపక యంత్రాన్ని తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన కారణంగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి, లాఠీఛార్జీ చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోకి పరుగులు తీశారు.

కేజ్రీవాల్ శాంతి సందేశం

ఆందోళనకారులు సహనంతో వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఏ రకమైన హింసను అనుమతించబోమన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

Last Updated : Dec 15, 2019, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details