దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ప్రముఖులను రంగంలోకి దించుతున్నాయి. నేడు భాజపా, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలను విడుదల చేశాయి.
భాజపా నుంచి...
భాజపా నుంచి మొత్తం 40 మంది ప్రముఖులు ప్రచారం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటులు హేమ మాలిని, సన్నీ దేఓల్, రవి కిషన్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ జాబితాలో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి...
కాంగ్రెస్ పార్టీ 40 మంది ప్రముఖులతో కూడిన ప్రధాన ప్రచారకర్తల జాబితాను విడదల చేసింది. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, అగ్ర నేత రాహుల్ గాంధీ ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ, నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మొత్తం 1029 మంది..
దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 1,029 మంది అభ్యర్థులు... 1,528 నామినేషన్లను వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. చివరి రోజున(మంగళవారం) 800 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. మొత్తం 1029 మంది అభ్యర్థుల్లో 187 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారం వరకు ఉందని అధికారులు తెలిపారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8న జరగనుంది. 11న ఫలితం వెలువడనుంది.
ఇదీ చూడండి: విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడి లొంగుబాటు