దిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు మెజారిటీ అభ్యర్థులకు చేదు అనుభవాలను మిగిల్చాయి. పోటీచేసిన దిగిన 672 మంది అభ్యర్థుల్లో 529మందికి పైగా డిపాజిట్ కోల్పోయారు. ఈ మేరకు దిల్లీ ఎన్నికల కమిషన్ గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 63 మంది అభ్యర్థులూ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీరత్, నేతలు ఏకే వాలియా, హరూన్ యూసఫ్, పర్వేజ్ హష్మి, పూనం ఆజాద్ వంటి ప్రముఖుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 529 మంది డిపాజిట్ కోల్పోయారు.
కాంగ్రెస్.. ఎదురుగాలి
గతంలో దిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవం కాంగ్రెస్ సొంతం. అయితే తాజా ఫలితాల్లో కాంగ్రెస్ ఎంతమాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. దివంగత షీలా దీక్షిత్ సారధ్యంలో మూడు సార్లు దిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండోసారి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక్క స్థానంలోనూ గెలవలేక చతికలపడింది.