2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తిరుగులేని విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపాకు ఎదురేలేదనుకున్నారు. అనంతరం.. సునాయాసంగానే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని భావించారు. 2013లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్.. తిరిగి రేసులోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో భారీ మద్దతు కూడగట్టుకుని భాజపాకు భారీ షాకిచ్చింది. 2015 ఎన్నికల్లో ఏకంగా 70కి గానూ 67 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అవినీతిపై పోరాటం సహా.. 'దిల్లీ వాసుల సంక్షేమమే ప్రాధాన్యం' హామీతోనే గెలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయితే.. భాజపా మద్దతుదారులను తనవైపు తిప్పుకోవడంలో అప్పట్లో కేజ్రీవాల్ తన చతురతను ఉపయోగించారు. దిల్లీలో ఆప్‌కు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన జాతీయ పార్టీ భాజపాపై విధేయత చూపించనట్లు కాదన్న భావన వారిలో కలిగేలా చేశారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కేజ్రీవాల్, ఆయన మద్దతుదారులు కేంద్రంలో మోదీకి, స్థానికంగా తమకు ఓట్లు కోరుతూ లక్షలాది మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు చేరవేశారు.
దూకుడుగా...
2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం భాజపా దూకుడుగా ముందుకెళ్లింది. "సైద్ధాంతిక నాస్తికుడు"గా కేజ్రీవాల్‌పై ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నం చేసింది. ఒకానొక దశలో కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భాజపా. ఆ వ్యాఖ్యల పట్ల విచారించనూ లేదు. కేజ్రీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా.. దిల్లీ షహీన్‌బాగ్ నిరసనల్ని ప్రస్తావించారు భాజపా నేతలు. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని ఆరోపించారు.
ఆప్ వైపు మళ్లిన తమ ఓటర్లను తిరిగి సంపాదించుకోవాలని కోరుకుంటోంది భాజపా. కేజ్రీవాల్ రాజకీయాలు, ప్రాధాన్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారికి గుర్తు చేస్తోంది.
ధీమాగా కేజ్రీవాల్...
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం తమ అభివృద్ధి సంక్షేమాలే ఆప్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలైన విద్యుత్తు, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో తమ పనితీరే ఎన్నికల్లో గెలుపునకు దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నారు. మైనార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ఫార్ములానే అవలంబించాలని చూస్తోంది ఆప్.
ద్విముఖ పోరేనా...!