దేశ రాజధాని దిల్లీలోని ముఖర్జీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓ వర్గానికి చెందిన టెంపో డ్రైవర్ను పోలీసులు మూకుమ్మడిగా అమానుషంగా లాఠీలతో కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది:-
వాయవ్య దిల్లీలో సరబ్జీత్ అనే డ్రైవ్ చేస్తున్న టెంపోను... పోలీసు వాహనం ఢీకొంది. సరబ్జీత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఒకదశలో తన వద్ద సంప్రదాయంగా ఉండే కత్తితో పోలీసులను బెదిరించాడు సరబ్జీత్. వాగ్వాదం ముగిసింది. ఎవరి దారిన వారు వెళ్తున్నారు.
అప్పుడే మొదలైంది అసలు కథ. ఆ టెంపోను వెంబడించిన పోలీసు వాహనం కాస్త ముందున్న పీఎస్ సమీపించగానే వాహనాన్ని అడ్డుకుంది. ఒక పోలీసు లోనికి వెళ్లాడు. పీఎస్ లోంచి పోలీసులు గుంపుగా రోడ్డుపైకి వచ్చేశారు. సరబ్జీత్ను చుట్టుముట్టారు. లాఠీలు ఝుళిపించారు. సరబ్జీత్తో పాటు అతడి కొడుకును లాఠీలతో చితకబాదారు. సరబ్జీత్ ఒంటి నిండా లాఠీల వాతలు పడ్డాయి.
"మేం ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాం. వెనుక నుంచి పోలీసు వాహనం వచ్చి ఢీకొట్టింది. అందులో నుంచి ఒక పోలీసు బయటకు వచ్చాడు. అసభ్య పదజాలంతో లాఠీ పట్టుకుని మావైపు వచ్చాడు. మమ్మల్ని కొట్టబోయాడు. అప్పుడు నా కొడుకు చేతులు జోడించి ప్రార్థిస్తే... ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మేమూ వచ్చేశాం. కానీ పోలీసు స్టేషన్ పరిసరాల్లో మమ్మల్ని అదే పోలీసు వాహనం అడ్డుకుంది. లాఠీ తీసుకుని కోపంతో మళ్లీ మా వైపు వచ్చాడు. కొద్దిసేపటికే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. స్టేషన్లో ఉన్న పోలీసులందరూ లాఠీలు పట్టుకుని మాపై దాడి చేశారు."
--- సరబ్జీత్ సింగ్, డ్రైవర్.
తనపై దాడి చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు సరబ్జీత్.
ఈ ఘర్షణలో ఒక పోలీసు గాయపడ్డాడు.