సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులు, రైతుల మధ్య చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ అంశంపై శుక్రవారం మరోమారు సమావేశమై చర్చించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణపై గురువారం సింఘూ సరిహద్దులోని మంత్రం రిసార్ట్లో రైతు సంఘాల నేతలు, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, హరియాణాకు చెందిన సీనియర్ పోలీసు అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ యాదవ్, ప్రత్యేక సీపీ( నిఘా విభాగం) దీపేందర్ పఠక్, ప్రత్యేక సీపీ సంజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
" భద్రతా సమస్యల కారణంగా దిల్లీ బాహ్య వలయ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించొద్దని ప్రభుత్వం తెలిపింది. అయితే.. అక్కడే ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరతామని స్పష్టం చేశాం. శుక్రవారం కేంద్రంతో జరిగే చర్చల అనంతరం పోలీసు అధికారులతో మారోమారు భేటీ కానున్నాం. "