దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ఘర్షణలకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు పోలీసులు. నేర చరిత్ర ఉందన్న కారణాలతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఏ ఒక్క విద్యార్థినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 15న దిల్లీ జామియా వర్సిటీలో ఆందోళనలు హింసాత్మకంగా జరిగాయి. పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దాడులకు పాల్పడటం, పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడ్డారు. వర్సిటీలో పోలీసు చర్యపై సర్వత్రా తీవ్ర దుమారం రేగింది. సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది.
అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు
200 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారని జామియా వర్సిటీ ఉపకులపతి నజ్మా అఖ్తర్ వెల్లడించారు. క్యాంపస్‌లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని.. దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో.. జామియా ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. విద్యార్థులనెవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
ఒక్క బుల్లెట్టూ ప్రయోగించలేదు..
'జామియా' నిరసనల సమయంలో.. దిల్లీ పోలీసులు ఒక్క బుల్లెట్టు కూడా ప్రయోగించలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అదుపులోకి తీసుకున్న 10 మందికీ నేరచరిత్ర ఉందని వెల్లడించాయి. అల్లర్లకు గల ఇతర కారణాలను ఆరా తీస్తున్నట్లు తెలిపాయి.