ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసకు రైతు సంఘాల నేతలే బాధ్యత వహించాలని దిల్లీ పోలీసులు వెల్లడించారు. నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ఘర్షణల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. వీరి వల్ల 394మందికిపైగా పోలీసు సిబ్బంది గాయపడినట్టు.. నేరానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలమని తేల్చిచెప్పారు.
ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసం జరిగిన ఒక రోజు అనంతరం మీడియాతో మాట్లాడారు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ. రైతులు నిబంధనలను ఉల్లంఘించి ద్రోహం చేశారని మండిపడ్డారు.
"రైతులు నిబంధనలు ఉల్లంఘించి.. నిర్దేశించిన సమయానికి ముందే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారు. ఇతర మార్గాల్లో నగరంలోకి ప్రవేశించారు. బారికేడ్లను తోసుకుని దిల్లీలోకి ప్రవేశించారు. అన్నదాతలను నియంత్రించడానికే బాష్పవాయువు, జలఫిరంగులు ఉపయోగించాం. దీని వల్ల జరిగిన హింసాకాండకు రైతు నాయకులే భాద్యత వహించాలి."
-- ఎన్ శ్రీవాస్తవ, దిల్లీ పోలీసు కమిషనర్