'బుజ్జగింపు కాదు.. సీఏఏకు మద్దతిచ్చే ప్రభుత్వం కావాలి' దిల్లీ ద్వారక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని ప్రజలకు బుజ్జగింపు చర్యలు వద్దని... సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు మద్దతునిచ్చే ప్రభుత్వమే అవసరమని పేర్కొన్నారు.
ఒకరిపై ఒకరు నిందించుకునే ప్రభుత్వం దిల్లీని పరిపాలిస్తోందని... కానీ దేశ రాజధానిని అభివృద్ధి పథంవైపు నడిపించే మార్గనిర్దేశకాలు ముఖ్యమని తెలిపారు మోదీ.
పేదలకు రక్షణగా ఉండే ఆయుష్మాన్ భారత్ యోజనను దిల్లీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మోదీ. కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'మొహల్లా' క్లినిక్‌లు ఇతర రాష్ట్రాల్లో పని చేయవని గుర్తుచేశారు.
"రూ.5 లక్షలు అందించే ఆయుష్మాన్ భారత్ పథకం సేవలు దిల్లీ పేదలకు అందడం లేదు. వారు చేసిన పాపం ఏంటి? ఈ సేవలు పొందన వ్యక్తి... ఏదైన పని మీద గ్వాలియర్ వెళ్లినా.. భోపాల్, సూరత్, నాగ్‌పుర్, హైదరాబాద్, చెన్నై వెళ్లి.. అకస్మాత్తుగా అక్కడ అనారోగ్యం పాలైతే.. ఈ 'మొహల్లా' క్లీనిక్‌లు ఆ వ్యక్తి వద్దకు రాగలవా? కానీ ఆయుష్మాన్ భారత్ యోజన దిల్లీలో అమలై ఉండుంటే.. ఆ వ్యక్తికి వేరే ప్రాంతంలో గుండెపోటు వచ్చినా... అక్కడి ఆసుపత్రుల్లో ఈ పథకంతో చికిత్స జరిగిపోతుంది. ఇలా ఒకరి ప్రాణం బతికినా... మనసు ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక్కడి సర్కారుకు మీ ఆరోగ్యంపై చింత లేదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
దేశంపై దాడి చేసే శత్రువులకు సహాయం చేసే ప్రభుత్వం దిల్లీకి అవసరం లేదన్న ప్రధాని... ఆప్ చేసే ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు.
దిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలకు ఈ నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడతాయి.