దిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానం వేదికగా 'ధన్యవాద్ దిల్లీ' పేరిట జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ చేత.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర పాల్ గౌతమ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మోదీ ఆశీస్సులు కావాలి...
ప్రమాణ స్వీకారం అనంతరం భారీసంఖ్యలో సభకు హాజరైన ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదన్నకేజ్రీవాల్...రాబోయే ఐదేళ్లలోనూ అదే తరహా పాలన అందిస్తామన్నారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడన్న ఏకే.. తన విజయాన్ని ప్రజావిజయంగా అభివర్ణించారు.
ప్రమాణ స్వీకార వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి స్నేహహస్తం అందించిన కేజ్రీవాల్.. దిల్లీ సంపూర్ణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు. ప్రచారంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నామని, దిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు ఆప్ అధినేత. దిల్లీ ప్రజలు దేశ రాజకీయాలను మార్చేశారని కితాబిచ్చారు.