మహిళల భద్రత కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి దిల్లీ రవాణా సంస్థ, మెట్రో అధికారులను నివేదిక అందివ్వాలని ఆదేశించారు.
"మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. దిల్లీ పరిధిలోని అన్ని డీటీసీ, క్లస్టర్ బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఫలితంగా వారు ప్రభుత్వ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. టికెట్ ధరలు భారీగా ఉండటం వల్ల ప్రస్తుతం వినియోగించడం లేదు. అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చా. వారంలోపు డీటీసీ, మెట్రో అధికారులు పూర్తి వివరాలు అందిస్తారు. రెండు మూడు నెలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం."