తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నీ అయిపోయాయి.. నిర్భయ దోషుల 'ఉరి' ఎప్పుడు? - nirbhaya latest news

ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటూనే ఉన్నారు నిర్భయ దోషులు. చివరి ప్రయత్నంగా పవన్​ కుమార్​ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరణకు గురైన నేపథ్యంలో వీరి ఉరితీతపై మళ్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ నిర్భయ దోషుల ఉరి.. ఎప్పుడు అమలు అవుతుందనే విషయంపై స్పష్టత లేదు.

nirbhaya case news
అన్నీ అయిపోయాయి.. నిర్భయ దోషుల 'ఉరి' ఎప్పుడు?

By

Published : Mar 4, 2020, 6:02 PM IST

Updated : Mar 4, 2020, 10:55 PM IST

అన్నీ అయిపోయాయి.. నిర్భయ దోషుల 'ఉరి' ఎప్పుడు?

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. శిక్ష అమలును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది న్యాయస్థానం. నలుగురు దోషుల్లో ఒకడైన పవన్​కుమార్​ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో వారికున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీని నిర్ణయించాలని దీల్లీ కోర్టును ఆశ్రయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీని తర్వాతే దోషుల ఉరిశిక్ష అమలుపై స్పష్టత రానుంది.

మరోవైపు నిర్భయ కేసు దోషులకు శారీరక, మానసిక స్థితిని పరీక్షించేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సూచించాలని దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను మొదట జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో దాఖలు చేయాల్సి ఉన్నందున తమ వద్ద విచారణకు అర్హమైనది కాదని తెలిపింది.

మూడుసార్లు వాయిదా..

దోషులు చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేసినందున మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రూపంలో శిక్ష అమలుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి ఉండగా.. దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు నలుగురు అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునే వరకు ఉరిశిక్షపై స్టే విధించాలని అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకరించినందున ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది.

ఆ తర్వాత దోషులకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల దిల్లీ కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశించింది. ఉరి అమలు దగ్గరపడుతున్న సమయంలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మరోసారి కోర్టుకు వెళ్లాడు. తన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గించాలని కోరుతూ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష అభ్యర్థన పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని మరోసారి కోర్టును కోరాడు పవన్​. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టే విధించింది న్యాయస్థానం.

పవన్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి నేడు తిరస్కరించారు. ఫలితంగా నలుగురు దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ నిర్ణయించాలని మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దిల్లీ ప్రభుత్వం.

ఇదీ చూడండి: మనుషుల అస్థికలు దాచే బ్యాంకు ఇది...

Last Updated : Mar 4, 2020, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details