హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. అధికారం నిలబెట్టుకుని, ఐదేళ్లుగా సవాళ్లతో అడ్డుపడుతూ వచ్చిన ప్రత్యర్థి భాజపా ముందు తలెత్తుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. దేశాన్ని పాలిస్తున్నా రాజధానిలో మాత్రం విపక్ష పాత్రకే పరిమితమవడం మింగుడుపడక, కంటిలో నలుసులా తయారైన కేజ్రీవాల్‌ను ఈసారి ఎలాగైనా ఇంటికి పంపాలన్న పట్టుదలతో భాజపా ఉంది. చీపురు పార్టీ ఉద్యమంతో చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదీ కుదరకుంటే కనీసం బలమైన ప్రతిపక్షంగానైనా నిలవాలని కోరుకుంటోంది.
ఈ మూడు పార్టీలు ఓట్ల వేటలో కుస్తీ పడుతున్నాయి. ఎన్నికల రోజు సమీపిస్తున్న కొద్దీ ఘాటు విమర్శలతో మోతెక్కిస్తున్నాయి. ప్రత్యర్థులపై కడపటి వ్యూహాలను పదునెక్కిస్తున్నాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో దద్దరిల్లుతున్న షాహీన్‌బాగ్ ధర్నా శిబిరాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకెళ్తున్నాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎత్తులు ఎలా ఉన్నాయంటే...
లగే రహో కేజ్రీవాల్
గతసారి 67 అసెంబ్లీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన ఆప్... ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
- ‘‘ఐదేళ్లు మంచిగా సాగాయి. కేజ్రీవాల్ దాన్ని కొనసాగించండి (అచ్చే బీతె పాంచ్ సాల్. లగే రహో కేజ్రీవాల్)’’ నినాదంతో ముందుకెళ్తోంది.
- ఐదేళ్లుగా చేపట్టిన విద్య, వైద్య, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కార్యక్రమాలు, పథకాలను ప్రచారం చేస్తోంది.
- తమకు గట్టి మద్దతుదారులుగా ఉన్న విద్యావంతులు, పేదలు, మురికివాడల్లో నివసిస్తున్న వారి ఓట్లను ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తోంది.
మోదీ-షాలపైనే భారం
2019లో దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ దక్కించుకున్నట్టే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాగా వెయ్యాలన్న పట్టుదలతో భాజపా ఉంది.
- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది వెల్లడించకుండా, మోదీ-అమిత్ షాలను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్తోంది. వారిని చూపించి ఓట్లు వేయించుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది.
- ప్రచారానికి ఏకంగా 240 మంది ఎంపీలను రంగంలోకి దించింది.
- కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి సాహసోపేత నిర్ణయాలను ప్రచారం చేస్తోంది.
- సీఏఏ వ్యతిరేకులతో కేజ్రీవాల్ చేతులు కలిపారని ఆరోపిస్తోంది.
ఈసారైనా పాగా వేయాలని..
వృద్ధ నాయకురాలు షీలాదీక్షిత్ నేతృత్వాన వరుసగా మూడుసార్లు శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్... 2015లో మాత్రం ఆప్ చేతిలో చితికిపోయింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే స్థానమైనా దక్కలేదు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం. దీంతో ఈ ఎన్నికల్లో చావో-రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఎదురైంది.
- త్రిముఖ పోరులో భాజపా-ఆప్‌లు ఓట్లు చీల్చుకుని తాము లబ్ధి పొందుతామన్న విశ్వాసంతో ఉంది.
- ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల క్రమంలో ఈ ఎన్నికల్లో గెలిచి పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపాలని, భవిష్యత్తుపై ఆశలు రేపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.
- సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం, ముస్లింల నిరసనలకు మద్దతివ్వడం ద్వారా ఆ వర్గాన్ని మళ్లీ కూడగట్టుకునేందుకు ప్రయత్నించింది.
- మైనార్టీల ప్రాబల్యమున్న 15-20 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించేలా పదునైన వ్యూహాలను అమలు చేస్తోంది.
- ఇందులో భాగంగా పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐను బలోపేతం చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో ఉద్యమాలకు ఊతమిచ్చింది.
ప్రచారాస్త్రంగా షాహీన్‌బాగ్
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో 40 రోజుల కిందట ముస్లింలు ప్రారంభించిన ధర్నా శిబిరం... మూడు పార్టీలకూ ప్రచారాస్త్రంగా మారింది. ఆప్, కాంగ్రెస్‌ల మద్దతుతోనే ముస్లింలు రహదారిని అడ్డగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని... తాము అధికారంలోకి వచ్చిన మరు క్షణమే శిబిరాన్ని లేపేస్తామని భాజపా నేతలు ఉద్వేగభరిత ప్రసంగాలు చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఉగ్రవాదితో పోల్చారు.
అయితే ఆయన అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. శిబిరాన్ని భాజపా ఎందుకు ఎత్తేయలేదని, అధికారం కోసం ఆ పార్టీ మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ శిబిరానికి పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా ముస్లిం ఓట్లపై కాంగ్రెస్ గట్టి విశ్వాసముంచింది.
- ఎన్నికల తేదీ:ఫిబ్రవరి 8, 2020
- మొత్తం స్థానాలు: 70
- ఫలితాలు: ఫిబ్రవరి 11, 2020