తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్​ కీ దిల్లీ:​ మరోసారి దిల్లీ పీఠంపై 'సామాన్యుడు'

దిల్లీ
delhi

By

Published : Feb 11, 2020, 7:09 AM IST

Updated : Feb 29, 2020, 10:39 PM IST

17:37 February 11

సరిలేరు 'కేజ్రీ'కెవ్వరూ.. దిల్లీ పీఠంపై ఆప్​ 'హ్యాట్రిక్​'

దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి అద్భుత విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ.. ఫలితాల్లో సత్తా చాటింది. మొత్తం 70 స్థానాలకుగాను 62 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. దిల్లీలోని మొత్తం 11 జిల్లాల పరిధిలోనూ.. ఆమ్‌ ఆద్మీ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు. పట్‌పడ్‌గంజ్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జయకేతనం ఎగురవేశారు.

పార్లమెంట్​లో అహో.. అసెంబ్లీలో అయ్యో

ఇటీవలి లోక్​సభ ఎన్నికల్లో దిల్లీలోని ఏడు స్థానాలనూ కైవసం చేసుకున్న భారతీయ జనతాపార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోర్లా పడింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను ఎనిమిది చోట్ల మాత్రమే భాజపా అభ్యర్థులు గెలిచారు.

2014నాటి లోక్​సభ ఎన్నికల్లోనూ దిల్లీలో అద్భుత ఫలితాలు రాబట్టిన భాజపా 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 3చోట్ల మాత్రమే గెలిచి.. ఘోర పరాజయం మూటగట్టుకుంది. తాజా ఎన్నికల్లోనూ కమలం పార్టీకి అదే తరహా ఫలితాలు వచ్చాయి. దిల్లీలోని 11 జిల్లాల్లో.. ఒక్క జిల్లాలోనూ భాజపా ఆధిపత్యం కనబర్చలేకపోయింది.

ప్రజాదరణ తగ్గలేదు

2015 ఎన్నికల్లో 67చోట్ల గెలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ... ప్రజాదరణ పెద్దగా తగ్గలేదని స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నాలుగు స్థానాలు తగ్గినప్పటికీ వరుసగా రెండోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్, 2015నాటి ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకొని సీఎం పగ్గాలు అందుకున్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో వరుసగా మూడోసారి దిల్లీ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.

15:55 February 11

కేజ్రీవాల్​కు అభినందనలు : జేపీ నడ్డా

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్​ కన్వీనర్​ అరవింద్ కేజ్రీవాల్​కు భాజపా జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. దిల్లీ అభివృద్ధికి ఆప్​ ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్న నడ్డా.. దిల్లీలో ప్రతిపక్ష పాత్రను సమర్థమంతంగా నిర్వహిస్తామని తెలిపారు.

15:49 February 11

మరో ఐదేళ్లు కష్టపడి పనిచేస్తాం:కేజ్రీవాల్‌

దిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే తమ గెలుపునకు బాటలు పరిచాయన్నారు. సామాన్యుడి కోసం అమలు చేసిన పథకాలే మమ్మల్ని గెలిపించాయన్నారు. మరో ఐదేళ్ల పాటు కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

15:44 February 11

కేజ్రీవాల్​ విజయోత్సవ ప్రసంగం

  • దిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు: అరవింద్‌ కేజ్రీవాల్‌
  • దిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి: కేజ్రీవాల్‌
  • దిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం: కేజ్రీవాల్‌
  • సామాన్యుడి కోసం అమలుచేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి: కేజ్రీవాల్‌
  • విద్యుత్, నీటిసరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి: కేజ్రీవాల్‌
  • విద్య, వైద్యం కోసం చేసిన కృషి వల్లే ప్రజలు మళ్లీ ఆదరించారు: కేజ్రీవాల్‌
  • ఇవాళ మంగళవారం.. హనుమాన్‌జీ ఆశీర్వదించారు: కేజ్రీవాల్‌
  • నా కుటుంబసభ్యులు సైతం ఆప్‌కు తోడ్పాటు అందించారు: కేజ్రీవాల్‌
  • మరో ఐదేళ్లపాటు అందరూ కలిసి కష్టపడదాం: కేజ్రీవాల్‌

15:38 February 11

కేజ్రీవాల్‌కు సీఎం జగన్‌ అభినందన

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఏపీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు.

15:18 February 11

కంగ్రాట్స్‌ కేజ్రీవాల్‌ జీ..

దిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశగా ఆప్‌ దూసుకెళ్తున్న నేపథ్యంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించిన దిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

15:17 February 11

పనిచేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు...

పట్‌పడ్​గంజ్‌ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. భాజపా విద్వేష రాజకీయాలను చేసిందని, కానీ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఎంచుకున్నారని పేర్కొన్నారు.

15:14 February 11

కేక్​ కోసిన కేజ్రీవాల్​ దంపతులు

భార్య సునీత జన్మదిన వేడుకలతో పాటు, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

14:44 February 11

సిసోడియా గెలుపు

డిప్యూటీ సీఎం గెలుపు...

పట్‌పడ్‌గంజ్‌ స్థానం నుంచి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ ఎట్టకేలకు సిసోడియా గెలుపొందారు.

14:36 February 11

ఆమ్​ఆద్మీకి జై...

దేశ రాజధాని ప్రజలు మరోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీకే జై కొట్టారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్‌ వరుసగా మూడోసారి విజయకేతనం ఎగురవేసింది.  మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ ఇప్పటికే సాధారణ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో గెలుపు దిశగా సాగుతోంది.

జిల్లాల వారీగా చూసినా మొత్తం 11 జిల్లాల్లోనూ ఆప్‌ తిరుగులేని ఆధిక్యం కనబరుస్తోంది. కేజ్రీవాల్‌ పార్టీ జోరు ముందు ప్రత్యర్థి పార్టీలు చిత్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న భాజపాకు అసెంబ్లీ పోరులో మాత్రం మరోసారి పరాజయం తప్పలేదు. అటు కాంగ్రెస్​కు మరోసారి దిల్లీలో తీవ్ర నిరాశే ఎదురైంది.

దిల్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ముందంజలో కొనసాగుతున్నారు. న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు.  పట్‌పడ్‌గంజ్‌ స్థానం నుంచి పోటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో మాత్రం విజయం దోబూచులాడుతోంది. 

14:27 February 11

మేజిక్​ ఫిగర్​ సొంతం...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆమ్​ఆద్మీ విజయం ఖాయమైంది. సాధారణ మెజార్టీ స్థానాలను ఇప్పటికే ఆప్​ కైవసం చేసుకుంది. 36 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

13:57 February 11

సిసోడియా ముందంజ... 

పట్​పడ్​గంజ్​ స్థానం నుంచి పోటీ చేసిన దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా... ప్రత్యర్థి రవి నెగీపై ముందంజలో ఉన్నారు.

13:42 February 11

అసెంబ్లీ రద్దు...

దిల్లీ లెఫ్టి​నెంట్​ గవర్నర్ ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేశారు​. మెజార్టీ స్థానాల్లో గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు అనిల్ బైజల్. మూడోసారి కేజ్రీవాల్​ సర్కార్​ కొలువుదీరనుంది. 

13:31 February 11

వెనుకంజ

పట్‌పడ్‌గంజ్‌లో వెనుకంజలోనే ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా

9 రౌండ్లు పూర్తయ్యేసరికి 1288 ఓట్ల వెనుకంజలో మనీశ్‌ సిసోడియా

13:29 February 11

విజయం

న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 13 వేల 508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

13:24 February 11

కేరళ సీఎం ట్వీట్...

దిల్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తోన్న ఆప్​కు, అరవింద్​ కేజ్రీవాల్​కు శుభాకాంక్షలు తెలిపారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​.

13:23 February 11

ప్రజా తీర్పును గౌరవిస్తాం: గంభీర్​                      

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమవంతు కృషి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరవింద కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్‌ నాయకత్వంలో దిల్లీ మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

13:14 February 11

పీకేతో కేజ్రీవాల్​...

దిల్లీ ఎన్నికల్లో ఆప్​కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్​ కిశోర్​ ఆప్​ కార్యాలయానికి చేరుకున్నారు. 

13:11 February 11

ఆప్​ కార్యాలయంలో కేజ్రీవాల్​...

దిల్లీ ఎన్నికల్లో ఆప్​ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈసీ ట్రెండ్స్​ ప్రకారం ఆమ్​ ఆద్మీ 56 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్, పార్టీ ఇతర నేతలు ఆప్​ కార్యాలయానికి చేరుకున్నారు. 

13:07 February 11

కేజ్రీవాల్‌ ముందంజ

న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ముందంజ

ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి 11,843 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్‌

13:00 February 11

సిసోడియా వెనుకంజ

  • పట్‌పడ్‌గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెనుకంజ
  • 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 859 ఓట్ల వెనుకంజలో మనీశ్‌ సిసోడియా

13:00 February 11

ఆధిక్యంలో ఆప్​...

  • దిల్లీలో కొనసాగుతున్న శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోన్న ఆప్‌
  • సాధారణ మెజారిటీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యం
  • వరుసగా మూడోసారి విజయం దిశగా ఆమ్‌ ఆద్మీ పార్టీ

12:59 February 11

భాజపా అభ్యర్థి విజయం

ముస్తఫాబాద్‌లో భాజపా అభ్యర్థి జగదీశ్‌ ప్రధాన్‌ విజయం

12:59 February 11

కేజ్రీవాల్‌ ముందంజ

  • న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ముందంజ
  • ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి 9,815 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్‌

12:51 February 11

దీదీ అభినందనలు...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భాజపాను తిరస్కరించారన్నారు. అభివృద్ధి మాత్రమే విజయం తెచ్చి పెడుతుందని, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను ప్రజలు తిరస్కరించారని అభిప్రాయపడ్డారు.               

12:30 February 11

విజయం

  • శీలంపుర్‌లో ఆప్‌ అభ్యర్థి అబ్దుల్‌ రెహమాన్‌ విజయకేతనం
  • దేవ్‌లీ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి ప్రకాశ్‌ విజయం
  • సంగం విహార్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి మోహనియా గెలుపు

12:27 February 11

కేజ్రీ ముందంజ...

  • న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ముందంజ
  • 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,277 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్‌

12:27 February 11

వెనుకంజ

  • దిల్లీ: పట్‌పడ్‌గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెనుకంజ
  • 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 1576కు పైగా ఓట్ల వెనుకంజలో మనీశ్‌ సిసోడియా

11:51 February 11

వెనుకంజలో సిసోడియా...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. పట్​పడ్​గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భాజపా అభ్యర్థి రవి నేగి కన్నా 1427 ఓట్లు వెనుకబడ్డారు. 

11:32 February 11

ఆకట్టుకుంటున్న ఆమ్​ ఆద్మీ ట్వీట్​... 

11:19 February 11

ఓఖ్లాలో భాజపా స్వల్ప ఆధిక్యం...

ఓఖ్లా అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి బ్రహం సింగ్​ 194 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:17 February 11

అల్కా లాంబా వెనుకంజ...

చాందినీ చౌక్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి అల్కా లాంబా 12 వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. 

11:07 February 11

ఆప్​- 52, భాజపా- 18...

ఈసీ అధికారిక ట్రెండ్స్​ ప్రకారం.. ఆప్​ 52 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. భాజపా 18 స్థానాల్లో ముందంజలో ఉంది.

11:01 February 11

ఆప్​ కార్యకర్తల సంబురాలు

ఆప్​ సంబురాలు..

ఆమ్‌ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆప్‌ కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకుంటున్నారు.

10:49 February 11

వెలవెలబోయిన భాజపా కార్యాలయం...

దిల్లీలోని భాజపా జాతీయ కార్యాలయం బోసిపోయింది. ఎన్నికల ట్రెండ్స్​లో భాజపా 18 సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తుండగా.. ఆప్​ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది.

10:36 February 11

ఇంకా అయిపోలేదు... 

భాజపా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలపై భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారి స్పందించారు. ప్రస్తుతం ఆప్‌-భాజపా మధ్య అంతరం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, తుది అంచనాకు వచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు. తాము ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు. ఫలితం ఎలా వచ్చినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందుకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

10:30 February 11

పెరిగిన ఆధిక్యం...

న్యూ దిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సీఎం కేజ్రీవాల్​ 4,387 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

10:23 February 11

దిల్లీ కౌెంటింగ్

కేవలం 112 ఓట్ల ఆధిక్యంలో...

పట్​పడ్​గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రత్యర్థిపై కేవలం 112 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మోడల్‌ టౌన్‌ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి కపిల్‌ మిశ్రామ 98 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  

10:19 February 11

ఈసీ అధికారిక సమాచారం...

ఈసీ లెక్కల ప్రకారం ఆమ్​ ఆద్మీ... 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 19 నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతోంది.

10:16 February 11

కేవలం 2026 ఓట్ల ఆధిక్యంలో...

కేజ్రీవాల్‌ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి కేవలం 2026 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భాజపా నేత విజయేంద్రగుప్త 1172 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

10:13 February 11

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని ఏడు స్థానాలను భాజపా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆప్‌ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అయితే, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్‌ తన పట్టును చూపిస్తోంది. ఇప్పటివరకూ 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, భాజపా 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అప్పుడు.. ఇప్పుడు అసలు కాంగ్రెస్‌ పోటీలోనే లేకుండా పోయింది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:06 February 11

ఈసీ ట్రెండ్స్​...

ఈసీ ట్రెండ్స్​ ప్రకారం ప్రస్తుతం ఆమ్​ఆద్మీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 16 స్థానాల్లో ముందంజలో ఉంది. 

10:02 February 11

కేజ్రీ దూకుడు...

న్యూదిల్లీ నియోజకవర్గంలో సీఎం కేజ్రీవాల్​ 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. 

రోహిణి అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి విజేందర్​ గుప్తా వెనుకంజలో ఉన్నారు.

09:59 February 11

వెనుకంజ

దిల్లీ: చాందినీ చౌక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా వెనుకంజ

09:46 February 11

గ్రేటర్​ కైలాస్​లో...

గ్రేటర్​ కైలాస్​ నియోజకవర్గంలో ఆప్​ అభ్యర్థి సౌరభ్​ భరద్వాజ్​ ముందంజలో ఉన్నారు. ఆప్​ పాలనను ప్రజలు మెచ్చుకున్నారని... అందుకే విజయం దిశగా దూసుకెళ్తున్నామని సౌరభ్​ తెలిపారు. 

09:32 February 11

ముందంజలో..

  • న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ముందంజ
  • దిల్లీ:పట్​పడ్​గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ముందంజ
  • దిల్లీ: షాకుర్‌ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్ర జైన్‌ ముందంజ
  • మాలవీయ నగర్‌లో ఆప్‌ అభ్యర్థి సోమ్‌నాథ్‌ భారతి ముందంజ

09:26 February 11

ఆప్​దే ముందంజ

మేజిక్​ ఫిగర్​ దాటేసిన ఆప్‌...

ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి కావాల్సిన 36 స్థానాలను ఎప్పుడో దాటేసిన ఆప్‌ ఇప్పుడు 50కు పైగా స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తుంది. వివిధ జిల్లాల్లో ఆప్‌ హవానే నడుస్తోంది. న్యూదిల్లీ, ఉత్తర దిల్లీ, షార్దా, దక్షిణ దిల్లీ, ఆగ్నేయ దిల్లీ, నైరుతి దిల్లీల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్‌ ఏకపక్షంగా ఫలితాలను రాబడుతుండగా, ఈశాన్య, వాయవ్య దిల్లీలో మాత్రం భాజపా బలం చాటుకుంటోంది.

09:07 February 11

కేజ్రీవాల్​

ప్రముఖుల పరిస్థితి...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూదిల్లీ నియోజకవర్గంలో అరవింద్‌ కేజ్రీవాల్‌,  పట్​పడ్​గంజ్‌ నుంచి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, షాకుర్‌ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్రజైన్ ముందంజలో ఉన్నారు. చాందినీ చౌక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా వెనుకంజలో కొనసాగుతున్నారు. రోహిణి నియోజకవర్గంలో భాజపా నేత విజయేంద్రకమార్‌ ముందంజలో ఉన్నారు. 

09:04 February 11

భారీ విజయమే: ఆప్​

ప్రస్తుత ట్రెండ్​ చూస్తే ఆప్​ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ​ ఎంపీ సంజయ్​ సింగ్​ ధీమా వ్యక్తం చేశారు. 

09:01 February 11

  • న్యూదిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ముందంజ
  • దిల్లీ:పట్​పడ్​గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ముందంజ
  • దిల్లీ: రోహిణి నియోజకవర్గంలో భాజపా నేత విజయేంద్రకుమార్‌ ముందంజ
  • దిల్లీ: షాకుర్‌ బస్తీ నుంచి మంత్రి సత్యేంద్ర జైన్‌ ముందంజ

08:58 February 11

అక్షర్‌ధామ్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో పట్​పడ్​గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, భాజపా అభ్యర్థి రవి నేగి 

08:55 February 11

ఎగ్జిట్​ పోల్స్​కు అనుగుణంగా...

  • ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోన్న ఆప్‌
  • సాధారణ మెజారిటీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యం
  • వరుసగా మూడోసారి విజయం దిశగా ఆమ్‌ ఆద్మీ పార్టీ
  • దిల్లీ: 5 జిల్లాల్లో ఏకపక్షంగా దూసుకెళ్తోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ
  • న్యూదిల్లీ, ఉత్తర దిల్లీలో తిరుగులేని ఆమ్‌ ఆద్మీ పార్టీ
  • షార్దా, దక్షిణ దిల్లీ, ఆగ్నేయ దిల్లీ, నైరుతి దిల్లీలో ఆప్‌ ఏకపక్షం

08:44 February 11

అక్కడక్కడా...

రోహిణి నియోజకవర్గంలో భాజపా నేత విజయేంద్రకుమార్‌ ముందంజలో ఉన్నారు. ఈశాన్య, వాయవ్య దిల్లీలో భాజపా తన సత్తా చాటుతోంది.

08:34 February 11

మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తున్న ఆప్‌

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మెజార్టీ స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది.  లెక్కింపు ఆరంభం నుంచే ఆప్‌ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. పట్​పడ్​గంజ్‌లో ఉపముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా ముందంజలో ఉన్నారు

08:20 February 11

కౌంటింగ్​ మొదలు...

  • దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • మొత్తం 21 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • దిల్లీ: మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు 33 మంది అబ్జర్వర్లను నియమించిన ఈసీ
  • ఓటింగ్ శాతం నిర్ధరణలో తీవ్ర జాప్యం, ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

08:02 February 11

దిల్లీలో కేజ్రీవాల్​ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. వివిధ జాతీయ టెలివిజన్‌ ఛానెళ్లు, సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీదే విజయమని తేలింది. అయితే 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు 67 చోట్ల గెలిచిన ఆప్​.. ఈసారి కొన్ని స్థానాలను కోల్పోనుందని సర్వేలు వెల్లడించాయి. భారతీయ జనతాపార్టీ తన బలాన్ని కాస్త పెంచుకుంటుందన్న సర్వేలు... కాంగ్రెస్‌ పరిస్థితి పెద్దగా మారే సూచనలు లేవని విశ్లేషించాయి.

07:48 February 11

ఎగ్జిట్​ పోల్స్​ మాటేంటి?

మరికొద్దిసేపట్లో దిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఈ నెల 8న ఓటింగ్​ జరగ్గా.. దిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్​ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

06:44 February 11

లైవ్​: 'దిల్లీ దంగల్'​.. కౌంటింగ్​కు వేళాయే!

మరికొద్దిసేపట్లో దిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఈ నెల 8న ఓటింగ్​ జరగ్గా.. దిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్​ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Last Updated : Feb 29, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details