ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు లొంగిపోయేందుకు అనుమతించాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేసింది దిల్లీ కోర్టు.
ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ నేతృత్వంలోని ధర్మాసనం చిదంబరం పిటిషన్పై విచారణ చేపట్టింది.
కస్టడీ అవసరం లేదు..
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం చిదంబరం అరెస్ట్ అవసరం ఉన్నప్పటికీ.. సరైన సమయంలోనే అదుపులోకి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నందున సాక్ష్యాధారాలను మార్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు ఈడీ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. చిదంబరం పిటిషన్ను తిరస్కరించాలని కోరారు.
ప్రస్తుతం ఆయన్ని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మెహతా. నిందితుడు దర్యాప్తు సంస్థకు మార్గనిర్దేశం చేయలేడని, అదుపులోకి తీసుకోవాలనే ఉత్తర్వుల ద్వారా దర్యాప్తు సంస్థ విచక్షణను తగ్గింస్తుందని అభిప్రాయపడ్డారు.