తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2020, 5:56 PM IST

Updated : Mar 19, 2020, 6:21 PM IST

ETV Bharat / bharat

'నిర్భయ' దోషులకు ఉరి తథ్యం- రేపు ఉదయమే అమలు

"నిర్భయకు న్యాయం"... 7 ఏళ్లుగా యావత్ భరత జాతి చేస్తున్న నినాదం. ఈ డిమాండ్​ ఎట్టకేలకు నెరవేరనుంది. వైద్యవిద్యార్థినిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, బలిగొన్న మృగాళ్లకు మరణశిక్ష పడనుంది. శుక్రవారం ఉదయం 5.30కి నలుగురు దోషుల్ని ఉరి తీసేందుకు సర్వం సిద్ధం చేసింది దిల్లీ తిహార్ జైలు యంత్రాంగం.

Delhi court refuses to stay execution of Nirbhaya rapists; convicts to be hanged tomorrow
'నిర్భయ' దోషులకు ఉరి తథ్యం- రేపు ఉదయమే అమలు

2012లో దేశ రాజధాని నడిబొడ్డున సంచలనం రేకెత్తించిన 'నిర్భయ' అత్యాచారం, హత్య ఘటన బాధితురాలికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఉరి శిక్షను ఆపేందుకు దోషులు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నలుగురు దోషులను రేపు ఉదయం 5.30 గంటలకు దిల్లీ తిహార్​ జైల్లో ఉరి తీయనున్నారు. వారు శ్వాస తీసుకునేది మరికొన్ని గడియలు మాత్రమే. ఆ తర్వాత ప్రాణాలు గాల్లో కలవనున్నాయి.

ముకేశ్​ సింగ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ కుమార్​ సింగ్​(31) నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. మార్చి 20న ఉరి తీయాలని 15 రోజుల కిందటే దిల్లీ ట్రయల్​ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ తిహార్​ కారాగారంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జైలు సిబ్బంది.

ఈరోజంతా హైడ్రామా...

ఉరి శిక్షను ఆపేందుకు ఆఖరి రోజున విశ్వప్రయత్నాలు చేశారు నిర్భయ దోషులు. వేర్వేరు సాకులతో దిల్లీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్లు అన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి.

దోషులు అక్షయ్​ కుమార్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మ తమ ఉరి శిక్షపై స్టే విధించాలనంటూ దిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్​ను కొట్టివేసింది.

పవన్​ గుప్తా రెండోసారి వేసిన క్యురేటివ్​ పిటిషన్​నూ సుప్రీం కోర్టు కొట్టివేసింది. దోషి అక్షయ్​ రెండోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని కూడా సుప్రీం కొట్టివేసింది. జస్టిస్​ భానుమతి, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నల ధర్మాసనం... పిటిషన్​ను విచారించదగ్గ అర్హత లేదని తేల్చిచెప్పింది.

అక్షయ్​ తొలుత జనవరి 29న, అనంతరం.. మార్చి 18న క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ రెండూ తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు, నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనంటూ నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్‌ సింగ్‌ అభ్యర్థననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇక తప్పదు...

దోషుల ఉరితీతకు ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సీమా కుష్వాహా.

'నిర్భయ' దోషులకు ఉరి తథ్యం

''దోషులకున్న న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. రేపు ఉదయం 5. 30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు జరుగుతుంది.''

- సీమా కుష్వాహా, నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాది

ఇప్పటికి 3 సార్లు వాయిదా...

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని తొలుత దిల్లీ కోర్టు 2 నెలల కిందటే డెత్​ వారెంట్​ జారీ చేసింది. అయితే.. వారికున్న న్యాయపరమైన అవకాశాలను ఒక్కొక్కరుగా వాడుకుంటూ మరణ శిక్షను ఆలస్యం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఒకరి తర్వాత ఒకరు క్యురేటివ్​ పిటిషన్​, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​, సుప్రీం కోర్టులో సవాల్​.. వాటి తిరస్కరణల తర్వాత రెండోసారి పిటిషన్లు, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇలా దాదాపు 2 నెలలు జాప్యం చేశారు. ఎట్టకేలకు వారి అవకాశాలన్నీ ముగిసినందున రేపు ఉరిశిక్షకు మార్గం సుగమమైంది.

ఇదీ వాయిదాల పర్వం...

నలుగురు దోషులను 2020 జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు జనవరి 7న ఆదేశాలు జారీచేసింది. దోషుల వివిధ పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున జనవరి 22న శిక్ష అమలు కష్టమని దిల్లీ ప్రభుత్వం తెలపగా 2020 ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని 2020 జనవరి 17న దిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసింది.

తర్వాత ఫిబ్రవరి 1న శిక్ష అమలుకు ఇచ్చిన డెత్‌వారెంట్లు నిలిపివేస్తూ జనవరి 31న దిల్లీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు దోషులకు మార్చి 3న మరణదండన అమలు చేయాలని 2020 ఫిబ్రవరి 17న దిల్లీ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది.

చివరగా నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిన కారణంగా.. మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని దిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత కూడా.. దోషులు మరణదండన తప్పించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. అయినప్పటికీ రేపు ఉదయం ఉరి శిక్ష తథ్యం కానుంది.

ఇదీ కేసు...

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ దిల్లీ ట్రయల్​ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.

Last Updated : Mar 19, 2020, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details