ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు దిల్లీ పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22 ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. దిల్లీ తిహార్ జైలులో ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దోషులకు సత్వరమే శిక్ష అమలుచేయాలన్న నిర్భయ తల్లిదండ్రుల అభ్యర్థనతో పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి సతీశ్ కుమార్ అరోడా ఈమేరకు ఉత్తర్వులు వెలువరించారు. ఉరిశిక్షను ఆపేందుకు ఏమైనా న్యాయపరమైన అవకాశాలు ఉంటే దోషులు వాటిని 14 రోజుల్లోగా ఉపయోగించుకోవాలని సూచించారు.
కేసు విచారణ సమయంలో దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు హాజరుపరిచారు.
నాటకీయ పరిణామాలు...
విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. వీడియో లింక్ ద్వారా న్యాయమూర్తితో మాట్లాడిన దోషులు కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం.
న్యాయపరంగా ఇంకా అవకాశాలు ఉన్నాయని దోషుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ల దాఖలు ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. దోషి ముఖేశ్ తరఫున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు జైలు అధికారుల నుంచి మరికొన్ని పత్రాలు రావాల్సి ఉందని తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ తెలిపారు. దోషుల మానసిక ఆరోగ్య స్థితిపైనా నివేదిక తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
ఈ వాదనల్ని నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అవకాశం ఉన్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చన్నారు. క్యూరేటివ్ పిటిషన్‌కు అవకాశం ఉందని డెత్ వారెంట్ జారీని నిలుపుదల చేయకూడదన్నారు.
నిర్భయ తల్లి హర్షం...
కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చట్టాలు, న్యాయస్థానాలపై మహిళలకు ప్రగాఢమైన నమ్మకాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఉరిశిక్షను ఆపేందుకు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.