దేశ రాజధాని దిల్లీలో 2012లో నిర్భయపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులు ముఖేశ్‌సింగ్, అక్షయ్‌కుమార్‌సింగ్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలకు ఈనెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో.. దేశంలో విధిస్తున్న మరణశిక్షలు, వాటి అమలు తీరుతెన్నులకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. గత 15 ఏళ్లలో మరణదండన విధించిన కేసుల్లో కేవలం ఒక్కశాతం మందినే ఉరితీసినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ), మానవహక్కుల ఆసియా కేంద్రం(ఏసీహెచ్‌ఆర్) గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 డిసెంబరు వరకు దేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్న వారు 400 మంది వరకు ఉంటే.. గత 15 ఏళ్లలో కేవలం నలుగురికే ఉరిశిక్ష అమలుచేశారు. ఈ శిక్ష పడిన దాదాపు 1200 మందికి జీవితఖైదు కిందికి మార్చారు. కోర్టుల్లో సుదీర్ఘకాలం విచారణ కొనసాగుతుండడం, చాలామంది రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తుండడం వల్ల మరణదండన అమలులో జాప్యం జరుగుతోంది.
గత 15 ఏళ్లలో మరణశిక్ష అమలైన నలుగురు
1. ధనుంజయ్ ఛటర్జీ
బాలికపై అత్యాచారం చేశాడన్న కారణంపై బంగాల్‌కు చెందిన ధనుంజయ్‌కి మరణ దండన విధించారు. అతని 42వ యేట 2004 ఆగస్టు 14వ తేదీన అలీపూర్ జైల్లో ఉరిశిక్ష అమలుచేశారు.
2. అజ్మల్ కసబ్
2008 నవంబరు 26వ తేదీన ముంబయిలో ఉగ్రదాడికి తెగబడిన పాకిస్థాన్ తీవ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒకడు. నాలుగేళ్ల విచారణ తర్వాత ఇతన్ని 2012 నవంబరు 21వ తేదీన పుణెలోని ఎరవాడ జైల్లో ఉరివేశారు.